మరోదారి లేదు.. ఊరి చివరకు ‘కొట్టు’కెళ్లారు..

Small traders securing employment with Covid Effect - Sakshi

సాక్షి, అమరావతి:  గతంలో జాతీయ, ఇతర ప్రధాన రహదారుల వెంబడి అక్కడక్కడా దాబాలు కనిపించేవి. ప్రయాణికులు నులక మంచాలపై కూర్చుని.. చెక్క బల్లలపై పెట్టిన ఆహారాన్ని ఆరగించే దృశ్యాలు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర.. రోడ్లపక్కన వెలిసిన దుకాణాలు కన్పిస్తున్నాయి. ఇది కోవిడ్‌ తెచ్చిన మార్పు. 2020 మార్చి తర్వాత కోవిడ్‌ మహమ్మారి కారణంగా చితికిపోయిన చిరు వ్యాపారులు కనుగొన్న ఉపాధి మార్గమిది.  

లాక్‌డౌన్‌తో మొదలై.. 
కోవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూరగాయల షాపులు సైతం మూతపడ్డాయి. ఆ తరువాత లాక్‌డౌన్‌ సడలించినప్పటికీ వైరస్‌ భయంతో మార్కెట్‌కు వెళ్లేందుకు జనం కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అలా అని ఇంటింటికీ వెళ్లి విక్రయాలు చేద్దామంటే.. వైరస్‌ మోసుకొస్తారనే భయం వెంటాడేది. ఇలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారులు బాగా చితికిపోయారు. గత్యంతరం లేని స్థితిలో వారు రోడ్డు బాట పట్టారు. జాతీయ రహదారులే కాకుండా.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర రోడ్ల పక్కన చిన్నపాటి షాపులు పెట్టుకుని అమ్మకాలు సాగించారు.

అటుగా పోయే ప్రయాణికులు ఆగి అవసరమైన వాటిని అప్పటికప్పుడు కొనుగోలు చేసుకుని వెళ్లడంతో ఈ ట్రెండ్‌కు ఆదరణ లభించింది. ఫలితంగా జాతీయ రహదారుల పక్కన కూరగాయలు, పండ్లు, ఎండు చేపలు, పచ్చి చేపలు, రొయ్యలు, తినుబండారాలు, ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఏ రోజు వ్యాపారం ఆ రోజే కావడంతో అక్కడ తాజా పండ్లు, కూరగాయలు దొరుకుతున్నాయని, అవసరమైనప్పుడు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటోందని వినియోగదారులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులు పాటిస్తున్న ఈ ఐడియా వారి కుటుంబాలను నిలబెడుతోంది.  

బతుకుదెరువు కోసమే ఈ ‘మార్గం’ 
నేను 16 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్నాను. గతంలో భీమవరం మార్కెట్‌లో షాపు అద్దెకు తీసుకుని కూరగాయలు అమ్మేవాడిని. కరోనా ఫస్ట్‌వేవ్‌ నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. కరోనా ఉధృతి పెరగడంతో మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇబ్బందులు పడ్డాం. చివరకు నిత్యం వాహనాలు తిరిగే రోడ్డు పక్కన కూరగాయల షాపు పెట్టాను. దారిన పోయేవారు వచ్చి కావాల్సిన కూరగాయలు కొనుక్కుని వెళ్తారు కాబట్టి అంతగా రద్దీ ఉండదు. ఊరి చివర ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి కార్లు, బైక్‌లు పార్కింగ్‌ చేసుకునేందుకు ఇబ్బంది లేదు.  గతంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం రావడం లేదు. కానీ.. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. కరోనా దెబ్బకు కొత్త మార్గాన్ని ఎంచుకుని ఉపాధి చూసుకుంటున్నాం.     
– జవ్వాది దుర్గాప్రసాద్, కూరగాయల వ్యాపారి, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా 

రోడ్డు పైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తాం 
రెండేళ్లుగా కరోనా వైరస్‌ కలవరపెడుతూనే ఉంది. షాపులకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా వైరస్‌ భయం వెంటాడుతోంది. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రోడ్డు పక్కన పెట్టిన కూరగాయలు, పండ్లు, ఇతర సరుకుల్ని అప్పటికప్పుడు కొనుక్కు  తెచ్చుకుంటున్నాం. రోడ్డుపైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తున్నాం. ఇబ్బందులకు తావు లేకుండా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటోంది. 
– శనివారపు శ్రీనివాస్, ఉండి అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top