పట్టు తప్పుతోంది! | Silk Farmers Protest in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పట్టు తప్పుతోంది!

Jun 23 2025 6:05 AM | Updated on Jun 23 2025 6:05 AM

Silk Farmers Protest in Andhra Pradesh

రోజురోజుకూ పడిపోతున్న పట్టుగూళ్ల ధరలు 

హిందూపురం’ మార్కెట్‌లో కిలో రూ.600 కూడా పలకని వైనం 

ధరల తగ్గుదలతో ఆందోళనలో రైతులు 

ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు

దిగుబడి పెరిగిందని ఆనందంలో ఉన్న పట్టురైతుకు ‘ధరాఘాతం’ తగులుతోంది. బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ధర రోజురోజుకూ దిగజారుతుండగా..రైతు పరిస్థితి బేజారవుతోంది. ప్రోత్సాహకం అందించి ఆదుకోవాల్సిన కూటమి సర్కార్‌ పట్టించుకోకపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.  

మడకశిర/హిందూపురం: పట్టుగూళ్ల ధరలు నెలరోజులుగా తగ్గుముఖం పట్టాయి. పట్టుగూళ్ల విక్రయాలకు రాష్ర్టంలోనే పేరెన్నికగన్న సత్యసాయి జిల్లా హిందూపురం మార్కెట్‌లోనూ ఆశించిన ధర దక్కడం లేదు. నాణ్యత బాగానే ఉన్నప్పటికీ ధర లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.  

ధరలేక రైతు దిగాలు.. 
ప్రస్తుతం హిందూపురం మార్కెట్‌కు రోజూ 4 వేల నుంచి 5 వేల క్వింటాళ్ల వరకు బైవోల్టిన్‌ పట్టుగూళ్లు వస్తున్నాయి. హిందూపురం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ జిల్లాలతోపాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా రైతులు పట్టుగూళ్లను ఇక్కడికి తెస్తున్నారు. అయితే నాణ్యమైన గూళ్లు తెచ్చినా రైతులు ఆశించిన ధర మాత్రం పలకడం లేదు. నెల క్రితం కేజీ బైవోల్టిన్‌ పట్టుగూళ్లు గరిష్టంగా రూ.750 వరకు పలికాయి. కనిష్ట ధర రూ.620 తగ్గకుండా ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి గరిష్ట ధర రూ.600 దాటడం లేదు. కనిష్ట ధర రూ.500 లోపే ఉంటోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కోసారి హిందూపురం వరకూ పట్టుగూళ్లు తెచ్చిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వేచిచూస్తే కొంతమేలు.. 
పట్టుగూళ్ల అమ్మకాలకు ఆన్‌లైన్‌ ద్వారా టెండర్‌ వేసే ప్రక్రియ సాగుతోంది. అయితే ప్రతిసారి        1, 2 టెండర్లలో తక్కువ ధర లభిస్తోంది. అందువల్ల మూడో టెండర్‌ వరకు వేచి చూస్తేనే ధర కాస్త పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. కొన్నిసార్లు మూడో టెండర్‌లోనూ మంచి ధర దక్కడం     లేదంటున్నారు. పట్టుగూళ్లు నిల్వచేసే అవకాశం లేకపోవడంతో రీలర్లు ఏకమై ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు.  

ఆదుకోని ప్రభుత్వం.. 
మార్కెట్‌లో పట్టుగూళ్ల ధరలు హెచ్చుతగ్గులు   ఉన్నప్పుడు తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం పట్టురైతులను ఆదుకోవాల్సి ఉన్నా.. ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. బైవోల్టిన్‌ రకం పట్టుగూళ్ల ఉత్పత్తికి కిలోపై అదనంగా ఇచ్చే రూ.50 ప్రోత్సాహకాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టు రైతులకు అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement