
మరో 199 మండలాల్లో వడగాడ్పులు
పలుచోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 47 మండలాల్లో గురువారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాలు, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, ఎన్టీటఆర్ జిల్లాలోని 1 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అలాగే మరో 199 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయన్నారు. శుక్రవారం 79 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 186 మండలాల్లో వడగాడ్పులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
సిద్ధవటంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత
ఇదిలావుండగా బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.7, చిత్తూరు జిల్లా నిండ్రలో 40.1, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు.