
వరుస హత్యలతో వణికిపోతున్న నగరం
కూటమి పాలనలో క్రైమ్ రాజధానిగా వైజాగ్?
పెట్రేగిపోతున్న నేరగాళ్లు
హత్యలు, గ్యాంగ్ వార్‌లతో అలజడులు
విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దందాలు
చోరీలు.. దోపిడీలు.. హత్యలు.. లైంగిక దాడులు.. గంజాయి బ్యాచ్‌ల గ్యాంగ్ వార్‌లు.. మాదక ద్రవ్యాల మత్తులో యువకుల ఘర్షణలు.. ఇలా వరుస ఘటనలతో విశాఖ వణికిపోతోంది. ప్రశాంత నగరంలో రోజూ ఎక్కడో చోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో రౌడీషిటర్లు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డు మీదే కత్తులతో తెగబడుతున్నారు. హత్యలకు పూనుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ గ్యాంగ్ వార్‌లతో అలజడి సృష్టిస్తున్నారు. ఫలితంగా సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖ.. ఇప్పుడు సిటీ ఆఫ్ క్రైమ్‌గా మారిపోతోంది. ఇందుకు ఇటీవల జరిగిన హత్యలు, దాడులు, చోరీ ఘటనలే నిదర్శనం. – విశాఖ సిటీ
ప్రకృతి అందాలతో అలరారే ప్రశాంత విశాఖలో నేడు రక్తపుటేర్లు పారుతున్నాయి. వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు వారాల్లో మూడు హత్యలు జరగడం కలకలం రేపుతోంది. ఈ ఆరు నెలల కాలంలో నగరంలో 12 హత్యలు చోటు చేసుకున్నాయి. వీరిలో ఏడుగురు మహిళలే బలవడం గమనార్హం.
⇒ ఈ నెల 13న అర్ధరాత్రి వెంకటేశ్వరమెట్టకు చెందిన రౌడీషిటర్ చెట్టి ఎల్లాజీ అలియాస్ వట్టి (22) హత్యకు గురయ్యాడు. గొడవలు వద్దు.. సర్దుకుపోండి అన్నందుకు స్నేహితుడే అతడిని కత్తితో పొడిచి హతమార్చాడు.
⇒ ఈ నెల 8న అర్ధరాత్రి పాత కక్షలతో పెందుర్తి పరిధి పులగానిపాలానికి చెందిన రౌడీషిటర్ మాసపు లోహిత్ (20) అలియాస్ నానిని అతడి స్నేహితులే పక్కా ప్లాన్ వేసి చంపేశారు. మాధవధార కుంచుమాంబ అమ్మవారి పండగలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
⇒ ఈ నెల 6న కొబ్బరితోటకు చెందిన కనకరాజు(32) అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. మద్యం సేవించి కింద పడటంతో తల వెనుక బలమైన గాయం తగలడంతో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు చెబుతుండగా.. ఇది హత్యేనని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
⇒ ఈ నెల 1న జ్ఞానాపురం శ్మశానవాటికలో అల్లిపురం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ నాగమణి ఎల్లాజీ(35) హత్యకు గురయ్యాడు. శ్మశాన వాటిక సిబ్బందిని బెదిరించిన ఘటనలో ఒకరు చేతిలో ఉన్న గెడ్డపారతో ఎల్లాజీ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మహిళలకు రక్షణ కరువు
ఒక్క రోజులో డెలివరీ కాబోయే భార్యను అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన భర్త.. డబ్బు కోసం వృద్ధ దంపతులపై కత్తితో దాడి చేసి వివాహిత మెడ కోసి మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయిన అగంతకుడు.. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు.. దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్‌లో మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని వారించిన తల్లిని కొట్టి చంపిన కొడుకు.. ఇలా విశాఖలో వరుసగా మహిళలు హత్యకు గురవుతూ నే ఉన్నారు.
మహిళల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలు విశాఖలో పరిస్థితులపై కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోరు మెదపడం లేదు. పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నా.. కూటమి ప్రభు త్వానికి పట్టడం లేదు. ఈ ఘటనలు విశాఖ ఆర్థిక రాజధానిగా కాకుండా నేర రాజధానిగా మారుతోందన్న వార్తలకు బలాన్నిస్తున్నాయి.
డ్రగ్స్ కలకలం
కూటమి ప్రభుత్వంలో విశాఖ గంజాయికే కాకుండా డ్రగ్స్ కూడా అడ్డాగా మారిపోయింది. అందుకు ఇటీవల జరిగిన కొకైన్ వ్యవహారమే నిదర్శనం. ఢిల్లీ నుంచి కొకైన్‌ను విశాఖకు తీసుకొచ్చిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురి కూటమి నేతల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్‌తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వీరిలో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చూపించారు.
మిగిలిన ఇద్దరిని వదిలేయడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరిని అరెస్టు చేయకుండా కూటమి ప్రజాప్రతినిధులపై పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ సరఫరాదారుడు ఢిల్లీలో ఉంటే ప్రిన్స్ అనే కింగ్‌పిన్ కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్లాయి. కానీ ఇప్పటి వరకు అతడి ఆచూకీ లభించిలేనట్లు తెలుస్తోంది.
గంజాయి బ్యాచ్‌ల గ్యాంగ్‌వార్
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గంజాయి బ్యాచ్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రణాళిక పేరుతో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హడావుడి చేశారు. కానీ నగరంలో గంజాయి నిర్మూలన జరగకపోగా.. వినియోగం పెరిగిపోయింది. ఏజెన్సీలో జరిగే గంజాయి సాగుపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో నగరం నడిరోడ్డులోనే గంజాయి మొక్కలు దర్శనమివ్వడం సంచలనం రేపింది.
కొద్ది నెలల కిందట ఆంధ్రా మెడికల్ కాలేజీ వెనుక గంజాయి మొక్కలను గుర్తించగా.. తాజాగా వారం కిందట జ్ఞానాపురంలో ఒక పాడుబడిన ఇంట్లో గంజాయిని సాగు చేస్తున్న విషయం బయటపడింది. ఇలా కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు నగరానికి పాకింది. గంజాయి వినియోగం సైతం విపరీతంగా పెరిగింది. గంజాయి మత్తులో యువకులు నిత్యం దాడులు, దోపిడీలతో అమాయకులపై తెగబడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో గ్యాంగ్ వార్‌లు విపరీతంగా పెరిగిపోయాయి.
⇒ ఈ నెల 6న అర్ధరాత్రి తమను అవమానకరంగా మాట్లాడి వేధిస్తున్నారన్న కక్షతో ఓ వర్గం.. కొత్తపాలెం ప్రధాన రహదారి గవర రామాలయం వద్ద నలుగురిపై దాడి చేసి గాయపరిచింది.
⇒ ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి రైల్వే గ్రౌండ్ వద్ద రెండు గ్యాంగ్‌లు కొట్లాటకు దిగాయి. రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు గాయపడగా వారికి కేజీహెచ్‌లో చికిత్స అందించారు.
⇒ ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి గాజువాకలో జీవన్ అనే వ్యక్తిపై 11 మంది యువకులు బీరు బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.