వలస వచ్చినవారు తమ జోన్‌కు వెళ్లాల్సిందే..
స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2026లోని జోన్‌ల వారీగా సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరు జోన్‌లుగా సదరం స్లాట్స్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర కారణాలతో సొంత జిల్లాలకు దూరంగా ఉన్నవారు సైతం సులభంగా సదరం స్లాట్స్ పొందేలా గత ప్రభుత్వంలో రాష్ట్రం యూనిట్‌గా స్లాట్స్ జారీ ప్రక్రియను ప్రారంభించారు. సొంత జిల్లాల్లో స్లాట్ దక్కనివారు పక్క జిల్లాల్లో స్లాట్ పొందే వీలు కల్పించారు. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, జోన్ విధానంలో స్లాట్స్ విడుదల చేయనున్నారు. దీంతో ఉపాధి, ఉద్యోగం, ఇతర కారణాలతో సొంత జిల్లాలు వీడి దూర ప్రాంతాల్లో జీవనం సాగించే వారికి ఇక్కట్లు తప్పవు. ఉదాహరణకు
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా
నుంచి వేల మంది విజయవాడలో జీవనం సాగిస్తుంటారు. నూతన నిబంధనల ప్రకారం ఇలాంటి వారు తమ సొంత జిల్లా లేదా పక్క జిల్లాల్లో మాత్రమే సదరం స్క్రీనింగ్‌కు అర్హులు అవుతారు. విజయవాడలో స్లాట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదు. గతంలో ఏ జిల్లాలోని ఆస్పత్రుల్లో అయినా స్లాట్ పొంది, వైకల్య ధ్రువీకరణపత్రాలు పొందే వీలుండేది. ఇప్పు డా ప్రక్రియను రద్దు చేసి, ఆరు జోన్‌లుగా చంద్రబాబు ప్రభుత్వం సదరం స్లాట్స్‌ను విడుదల చేయనుంది. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని కూడా రద్దు చేసింది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వచ్చిన దివ్యాంగులకు తిప్పలు తప్పవు.
8 నుంచి సదరం స్లాట్ బుకింగ్
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల 8న ప్రారంభం కానుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి 13 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు సదరం పోర్టల్‌లో మార్పులు కూడా చేశామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయం లేదా ఏపీ సేవా పోర్టల్‌లో సిటిజన్ లాగిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆరు జోన్లలోని జిల్లాలు ఇలా...
జోన్–1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం
జోన్–2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
జోన్–3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం
జోన్–4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్–5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్–6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి


