‘సాక్షి’ ఎఫెక్ట్‌: స్టాఫ్‌ నర్సుల ఎంపిక నిలుపుదల 

Selective Retention of Staff Nurses In Uttarandhra - Sakshi

తప్పులతో తుది జాబితా

అన్యాయం జరిగిందని నర్సుల నిరసన

సిబ్బందిపై అవినీతి ఆరోపణలు

‘సాక్షి’లో కథనం రావడంతో ఉలికిపాటు

జాబితాను మళ్లీ పరిశీలిస్తున్న అధికారులు

అర్హులకు అన్యాయం జరగదంటున్న ఆర్డీ

మహారాణిపేట(విశాఖ దక్షిణ): స్టాఫ్‌ నర్సుల పోస్టు ల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎంపిక జాబితాలో తమకు అన్యాయం జరిగిందని నిరుద్యోగ నర్సులు, వెయిటేజీ మార్కులు కలపలేదని తాత్కాలిక ఉద్యోగులు బుధవారం కూడా తన నిరసన గళం వినిపించారు. దాదాపు 30 నుంచి 40 మందికి వెయిటేజ్‌ మార్కులు కలపలేదని విషయం బయటకు రావడంతో.. ఈ జాబితాను పునఃపరిశీలన కోసం అధికారులు భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

స్టాఫ్‌ నర్సుల ఎంపికలో గందరగోళంపై బుధవారం ‘సాక్షి’లో కథనం రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పుల తడకలతో కూడిన 172 మంది అభ్యర్థుల జాబితాను మళ్లీ పరిశీలన చేస్తున్నారు. కొంత మందికి అనవసరంగా ఎలా మార్కులు కలిశాయన్న దానిపై యంత్రాంగం దృష్టి పెట్టింది. అమరావతి నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విశాఖ చేరుకుని జాబితాను పరిశీలిస్తున్నారు.  

సిబ్బంది తీరుపై మండిపాటు.. 
స్టాఫ్‌ నర్సుల పోస్టుల కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాబితాను తయారు చేశారు. జీఓ ప్రకారం జాబితా తయారు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఎంపికలో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను తప్పించడం, అనర్హులను అందలం ఎక్కించడం కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. ఎంపికైన 172 మందిలో 100 మంది సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించారు. బుధవారం మరో 30 మంది సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జాబితాను పునఃపరిశీలన చేస్తున్న క్రమంలో ఇందులో ఎంత మంది పేర్లు ఉంటాయో.. ఊడుతాయో తెలియని పరిస్థితి. కాగా.. ఎంపిక జాబితా రూపొందించడంలో సిబ్బంది తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మార్కులు కలపడం, మరోసారి తొలగించడం, ఎంపిక జాబితాలో కొందరి పేర్లు ఇప్పుడు తొలగించడం.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.  

అభ్యర్థుల్లో ఉత్కంఠ.. 
పోస్టుల సంఖ్య పెరగడం, కోవిడ్‌ సమయంలో పనిచేసిన వారికి అదనపు మార్కులు కలపడం వంటి నిర్ణయాలు రావడంతో మెరిట్‌ లిస్ట్‌కు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమాసుందరి ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో కొత్త జాబితా కోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా..అర్హులకు అన్యాయం జరగదని డాక్టర్‌ ఉమా సుందరి హామీ ఇస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top