భక్తి విత్తుగా...ఆనందం మొలకెత్తగా 

Seed festival enthusiastically in tribal villages - Sakshi

ఆదివాసీ గ్రామాల్లో ఉత్సాహంగా విత్తనాల పండగ 

పూర్వీకుల ఆచార సంప్రదాయం ప్రకారం పండగ 

పంటలు బాగా పండాలని విత్తనాలకు పూజలు 

గ్రామ దీసారి, గుర్మవ్‌ల ద్వారా శంకుదేవుడికి పూజలు

పెదబయలు (అరకులోయ): మన్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నిర్వహించే పండగలు, పెళ్లిళ్లు, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. విశాఖ మన్యంలో ఆదివాసీ గిరిజనులు (పీవీటీజీ) తెగలకు చెందిన వారు పుష్య మాసంలో జరుపుకునే పండగల్లో  ముఖ్యమైనది ‘విత్తనాల పండగ’. మిగతా వారికి సంక్రాంతి పండగ ఎంత ముఖ్యమో వీరికి ఈ పండగ అంత ముఖ్యం. తాము పండించిన పంటల్లో చోడి (రాగులు) రాజ్‌మా, సామలు, ధాన్యం నాలుగు రకాలతో ప్రతి ఇంటి నుంచి కొద్దికొద్దిగా సేకరించి కొంత భాగం శుంకుదేవునికి నైవేద్యంగా సమర్పించి..మరో సగం శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ నాలుగు రోజులూ సందడి వాతావరణం ఉంటుంది.  ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 15 తేదీలోపు పండగా నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నెల 5వ తేదీ శనివారం ప్రతి ఇంటి నుంచి గ్రామ పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్‌లు కలిసి తొమ్మిది మంది వెదురుతో చేసిన కొత్త బుట్టలో ప్రతి ఇంటి నుంచి రాగులు, సామలు, కందులు, ధాన్యాన్ని నాలుగు రకాలను సేకరించి శంకుదేవుని సన్నిధికి చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజు ఆదివారం శంకుదేవుని వద్దకు డప్పు వాయిద్యాలతో తొమ్మిది మందితో గ్రామంలో అందరూ పూజలు చేశారు. అలాగే గ్రామ పొలిమేరలో పూజలు చేసి అక్కడ నుంచి మట్టి సేకరించి శంకుదేవునికి పెట్టి పూజలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పూజలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి చిన్న వెదురు బుట్టలో బియ్యం పోసి అందులో ప్రమిద పెట్టి దీపం వెలిగించి రెండు చేతులతో దీపం కొండెక్కకుండా శంకుదేవుని వద్ద మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చారు. దీపం మధ్యలో కొండెక్కితే అశుభంగా భావిస్తారు. ప్రతి ఇంటి నుంచి ఇలా వచ్చి సమర్పించిన తరువాత పూజారి, దీసారి, మరో ఏడుగురు గుర్మవ్‌లు పూజలు చేశారు. గిరిజన వాయిద్యాలు మోగగానే గుర్మవ్‌లు శుంకుదేవుని సన్నిధిలో నృత్యం చేశారు.  

శంకుదేవునికి కోడి..మేక.. పితృదేవతలకు పందిని బలిస్తారు 
మంగళవారం ఉదయం నుంచి పూజలు చేసిన తరువాత సాయంత్రం శంకుదేవుని కోడి, మేక బలిచ్చారు. పితృదేవతలకు పందిని బలిచ్చారు. జంతువుల రక్తాన్ని విత్తనాల్లో కలిపి, విత్తనాలు కొంత భాగం శంకుదేవుని వద్ద చిన్న గుంత తీసి పెట్టిన తరువాత మరికొంత భాగం విత్తనాలు ఇంటింటా  నైవేద్యంగా పంచుతారు. వారు ఈ ఏడాది వేసే పంటల్లో వాడే విత్తనాల్లో కలుపుతారు. తరువాత బలిచ్చిన జంతువులను వండుకుని నైవేద్యంగా గ్రామస్తులు తీసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా భోజనాలు పెడతారు. 

కన్నె గుర్మవ్‌ల నియామకం 
గ్రామంలో ఏడుగురు గుర్మవ్‌లు మహిళలే ఉంటారు. వీరు ఎక్కువగా ముసలివారే ఉంటారు. అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి కన్నె గుర్మవ్‌ల నియమిస్తుంటారు. గ్రామంలో పదేళ్లలోపు ఆడపిల్లను తల్లితండ్రుల అనుమతితో ఎంపిక చేస్తారు. బాలిక స్నానం చేసిన అనంతరం నూతన వస్త్రాలు ధరించిన తరువాత బావి నుంచి కన్నె గుర్మవ్‌ తెచ్చిన నీటిని వినియోగించి శంకుదేవునికి నైవేద్యం వండి, చెట్టుకు బోనం కుండను ఉట్టిలో ఉంచి వేలాడదీస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో  కన్నె గుర్మవ్‌ పాల్గొంటుంది. వారు చేసే పూజలను అనుసరిస్తుంది. 

గ్రామాల్లో దింసా నృత్యం సందడి 
విత్తనాల పండగ సందర్భంగా గ్రామాల్లో మహిళలు, చిన్నపెద్ద తేడా లేకుండా దింసా నృత్యం చేయడం ఆనవాయితీ. గిరిజన డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీ గ్రామాల్లో సందడి  నెలకొంటుంది.

పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ 
పూర్వీకుల ఆచారం ప్రకారం విత్తనాల పండగ నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, గ్రామంలో పశుసంపద బాగుండాలని, ప్రకృతి దేవతలకు పూజలు చేస్తాం. తాము పండించిన కొత్త పంటను శుంకుదేవుని దగ్గర ఉంచి కోడి, మేక, పందిని బలి ఇచ్చిన తరువాత ఆ రక్తాన్ని విత్తనాల్లో కలిపి శంకుదేవుని వద్దకు చిన్న గుంత తీసి విత్తనాలు వేస్తాం. మిగిలిన సగం విత్తనాలు ఇంటింటికి పంచుతాం. వారు ఈ ఏడాడి పంటకు ఉపయోగించే విత్తనాల్లో వాటిని కలిపి ఉపయోగిస్తారు.    
–వంతాల కళ్యాణం, గ్రామ పూజారి, కప్పాడ గ్రామం 

పంటలకు మేలు 
విత్తనాల పండగ ప్రతి ఏడాది నిర్వహిస్తాం. శంకుదేవుని సన్నిధిలో విత్తనాలు ఉంచి పూజలు చేసిన తరువాత అదే విత్తనాలు తీసుకుని నూతన పంటలకు ఉపయోగించే విత్తనాల్లో కలిపి సాగు ప్రారంభించడం ఆనవాయితీ. విత్తనాల పండగ ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. గుర్మవ్‌గా 55 ఏళ్ల నుంచి చేస్తున్నాను. 
–కిల్లో లక్ష్మి, గుర్మవ్, కప్పాడ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top