నిన్న ఆంక్షలు.. నేడు కేసులు

SEC Nimmagadda Ramesh orders action against Kodali Nani - Sakshi

మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశం 

సెక్షన్లను సైతం ఉదహరిస్తూ కృష్ణా ఎస్పీకి ఆదేశాలు 

మంత్రి ఎలాంటి సమావేశాలు నిర్వహించకున్నా మరుసటి రోజే చర్యలకు ఉపక్రమించిన ఎస్‌ఈసీ 

సాక్షి, అమరావతి: మంత్రి కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ శనివారం కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొడాలి నాని పంచాయతీ ఎన్నికలు ముగిసే 21వతేదీ వరకు మీడియాతో మాట్లాడకూడదని, సభలు, సమావేశాల్లో ప్రసంగించరాదని ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు మంత్రి నాని అదే రోజు వెంటనే వివరణ ఇచ్చినా సంతృప్తికరంగా లేదంటూ ఎస్‌ఈసీ చర్యలకు ఉపక్రమించారు.

ఈ పరిణామాలన్నీ ఒకే రోజు 10 గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి. అయితే ఆ తరువాత మంత్రి నాని ఎలాంటి సమావేశాలు నిర్వహించకున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆయనపై కేసు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, కమిషనర్‌పై కొడాలి నాని విమర్శలు, ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలు 1, 4 క్లాజ్‌లను అనుసరించి మంత్రి కొడాలి నానిపై ఐపీసీ సెక్షన్లు 504, 505 (1)(సీ), 506 కింద కేసు నమోదు చేయాలంటూ నిమ్మగడ్డ కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top