అమెజాన్‌లో పొదుపు సంఘాల ఉత్పత్తులు

Savings Associations Products on Amazon - Sakshi

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు త్వరలో అమెజాన్‌ ద్వారా డిజిటల్‌ మార్కెట్‌లోకి రాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలు దాదాపు 6,000 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు వాటిని డ్వాక్రా బజారుల ద్వారానే విక్రయిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆ ఉత్పత్తులకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వాటిని తయారు చేసే మహిళలకు అధిక ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

వారం కిందట విజయవాడ వచ్చిన అమెజాన్‌ ప్రతినిధులతో సెర్ప్‌ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్‌ ద్వారా అమెజాన్‌లో చోటు కల్పించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. అమెజాన్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుందని అధికారులకు వారు చెప్పారు.

అలాగే ఉత్పత్తులను సరఫరా చేసేందుకు స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులకు అమెజాన్‌ ప్రతినిధులు సూచించారు. దీంతో 6,000 రకాల ఉత్పత్తులను ఒకేసారి కాకుండా.. ఎక్కువ డిమాండ్‌కు అవకాశమున్న వాటితో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసే అంశంపై సెర్ప్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అమెజాన్‌ ప్రతినిధులు ఈ నెల 18న సెర్ప్‌ అధికారులకు అందజేయనున్నారు. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top