‘స్కిల్‌’ స్కామ్‌లో బాబు, లోకేశ్‌

Sajjala Alleges Chandrababu Role In Skill Development Scam In AP - Sakshi

వారిద్దరి స్పష్టమైన పాత్రను ఈడీ గుర్తించింది: సజ్జల

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు పూర్తిగా అవాస్తవం

కింది స్థాయిలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌పై సీఎం సీరియస్‌

రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిన గర్జన

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వారి నిర్వాకాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే గుర్తించిందన్నారు. ఈడీ తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.241 కోట్ల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించి కాజేశారని, చంద్రబాబు, లోకేష్‌ పాత్ర లేకుండా అంత భారీ ఎత్తున నిధులను మళ్లించడం సాధ్యం కాదన్నారు. ఈ కుంభకోణంలో వారి ప్రమేయం బట్టబయలు కావడం వల్లే కిక్కురుమనడం లేదని వ్యాఖ్యానించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కుంభకోణంపై ఈనాడు రామోజీరావు ఇచ్చిన ప్రకటనపై విస్మయం వ్యక్తం చేశారు. తాము చట్టానికి అతీతం అన్నట్లుగా ఆ ప్రకటన ఉందన్నారు.

కర్నూలు గర్జన గ్రాండ్‌ సక్సెస్‌..
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ జేఏసీ నిర్వహించిన రాయలసీమ గర్జన గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యిందని సజ్జల తెలిపారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గర్జన ప్రతిబింబించిందన్నారు. కర్నూలు ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. 

సీమ ద్రోహి చంద్రబాబే..
రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టని చంద్రబాబు ఎల్లోమీడియా ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి గాలేరునగరి, హంద్రీ నీవాలను చేపట్టి దివంగత వైఎస్సార్‌ రాయలసీమకు మేలుచేస్తే ఇప్పుడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని మరింతపెంచి, కాలువలను వెడల్పుచేసి శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా సీఎం జగన్‌ పనులు చేపట్టారని గుర్తు చేశారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే దిగువన నీటిమట్టం ఉన్నా రాయలసీమకు కృష్ణాజలాలను తరలించేలా ఎత్తిపోతల చేపట్టామన్నారు.  చిత్రావతిలో 10 టీఎంసీలు, గండికోటలో 27, బ్రహ్మంసాగర్‌లో 15 టీఎంసీలు నిల్వ ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలను, కర్నూలు, కడపలో క్యాన్సర్‌ ఆస్పత్రులను నెలకొల్పుతున్నామని, ఈ స్థాయిలో సీమకు గతంలో ఎవరూ మేలు చేయలేదన్నారు. చివరకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను కూడా చంద్రబాబు పూర్తిచేయలేదన్నారు. ఇప్పుడు సీఎం జగన్‌ దాన్ని పూర్తి చేసి ఆ ప్రాంతానికి నీళ్లందించేలా చర్యలు చేపట్టారన్నారు. చంద్రబాబు రాయలసీమకు మేలు చేయకపోగా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు వేయించి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనుల్లో జాప్యానికి చంద్రబాబు పాపాలే కారణమని చెప్పారు. కమీషన్ల కోసం పోలవరాన్ని బాబు ఏటీఎం మాదిరిగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే వెల్లడించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌ ప్రారంభించిన పోలవరాన్ని సీఎం జగన్‌ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారన్నారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు అవాస్తవం
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నారనడం పూర్తిగా అవాస్తవమని, ఆ వార్త చూసి తాము కూడా ఆశ్చర్యానికి గురయ్యామని సజ్జల ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమాచారం లోపం వల్ల కింది స్థాయిలో ఎవరో ఇలా చేశారని, ఈ అంశంపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనిరీతిలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చి భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు పోలీసు రిక్రూట్‌మెంట్‌ కూడా జరుగుతోందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి భద్రత చేకూర్చామన్నారు.

ఇది చదవండి: ‘స్కిల్‌’ స్కాంపై ఈడీ కొరడా

ఇదీ చదవండి: చంద్రబాబు హయాంలో యువత నిర్వీర్యం

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top