ప్రభుత్వ భవనాల్లో హంగులకు రూ.641.97 కోట్లు | Rs 641 crore for renovations in government buildings | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భవనాల్లో హంగులకు రూ.641.97 కోట్లు

Jun 5 2026 5:15 AM | Updated on Jun 5 2026 5:15 AM

Rs 641 crore for renovations in government buildings

కృష్ణా నది ఒడ్డున ఆరెకరాల్లో అమరావతి ‘ఐ’ 

సూర్యలంక, విశాఖలో బీచ్‌ షాక్స్‌.. మద్యం పారించేందుకు నిర్ణయం 

ఆ ఫలితాల ఆధారంగా ఇతర తీరప్రాంతాలకు విస్తరణ 

పోలవరం ఎడమ కాలువ 5 ప్యాకేజీ పనుల విలువ రెట్టింపు 

వ్యవసాయ పనుల సీజన్‌లో ఉపాధి హామీ పనులకు 60 రోజులు సెలవు 

అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు 

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు అదే దోపిడీని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ భవనాలకు లగ్జరీ హంగులు, సోకుల పేరుతో మరోసారి భారీగా నిధులను దోచుకునేందుకు ఎత్తుగడ వేసింది. 

ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాజధాని భవనాల అద్దాల అలంకరణలు, నగిషీల కోసం ఏకంగా రూ.3,338 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలపగా.. తాజాగా అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లోని హైకోర్టు భవనంలో హంగుల కోసం రూ.547.07 కోట్లు, ఐఏఎస్‌ భవనాల సోకుల కోసం రూ.94.90 కోట్లను వెచ్చించేందుకు పరిపాలన ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 

కేబినెట్‌ నిర్ణయాలివీ 
» అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ పరిధిలోని హైకోర్టు భవనంలో రూఫ్‌టాప్‌ ఎలివేషన్లలో ప్రీకాస్ట్‌ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్‌ బాడీలు, అంతర్గత రహదారులు, సబ్‌స్టేషన్, జడ్జెస్‌ డ్రాప్‌ఆఫ్‌–ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు రూ.547.07 కోట్లకు పరిపాలన ఆమోదం. టెండర్‌ ప్రక్రియకు అనుమతి. 

» రాయపూడి గ్రామంలోని ఐఏఎస్‌ (ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి) భవనాలకు హోమ్‌ ఆటోమేషన్‌ సిస్టమ్స్, అదనపు వార్డ్‌ రోబ్‌లు, స్టోర్‌ రూమ్, జ్యూస్‌ కౌంటర్, స్పైరల్‌ స్టెయిర్‌కేస్, బాల్కనీ విత్‌ క్యానోపీ, కార్‌ పార్కింగ్‌ షెడ్, గ్లేజ్డ్‌ రెయిలింగ్స్, టెన్సైల్‌ రూఫింగ్, హీట్‌ పంప్స్, బాహ్య విద్యుత్‌ పనులను రూ.94.90 కోట్లతో ఎల్‌–1 బిడ్డర్‌కు పనులు అప్పగించేందుకు ఆమోదం.  

»  లండన్, దుబాయ్‌ తరహాలో అమరావతి అందాలను చూపించేందుకు కృష్ణా నది ఒడ్డున 6 ఎకరాల్లో అమరావతి ‘ఐ’ నిర్మాణం. 30 ఏళ్ల ఒప్పంద కాలంతో టెండర్ల ఆహ్వానానికి ఆమోదం. 

»   అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజి్రస్టేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ, రిజి్రస్టేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలు, ఇతర వర్తించే చార్జీలు రూ.5.53 కోట్లు మినహాయింపు. 

»   రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మార్పుల కోసం నెగోషియబుల్‌ సెటిల్‌మెంట్‌ విధానంలో సవరణలకు ఆమోదం. 

»  చీరాల సూర్యలంక, విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా రెండేసి బీచ్‌ షాక్స్‌ ఏర్పాటు. ఫలితాల ఆధారంగా ఇతర తీర ప్రాంతాలకు విస్తరణ. బీచ్‌ షాక్స్‌లో కొన్నిరకాల మద్యం బ్రాండ్స్‌ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం.  

»   పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనుల విలువ రెట్టింపు చేసేందుకు ఆమోదం. గతంలో రూ.352.60 కోట్లకు మంజూరైన పనుల విలువను రూ.796.66 కోట్లకు పెంచుతూ సవరణ. 

»  బాపట్ల జిల్లా కుందేరు డ్రెయిన్‌కు రూ.517.50 లక్షలతో కాలువ తవ్వకం పనులకు ఆమోదం. 

»   అగ్రి గోల్డ్‌ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో 21 పోస్టుల భర్తీకి ఆమోదం. అగ్రి గోల్డ్‌ అంశంపై మంత్రుల కమిటీ. 

»   జూలై 1 నుంచి వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) చట్టం –2025 అమలు కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ఆమోదం. వీబీజీ రామ్‌జీ పథకంలో వ్యవసాయ పనుల సీజన్‌లో 60 రోజులు ఉపాధి పనులకు సెలవులిచ్చే అంశం కలెక్టర్లకు అప్పగింత. 

» అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో రెండెకరాల ప్రభుత్వ టీడీపీ జిల్లా కార్యాలయం కోసం 66 ఏళ్లపాటు ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున లీజుపై ఇచ్చేందుకు ఆమోదం. 

»  కాకినాడ అర్బన్‌ మండలంలో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ జిల్లా కార్యాలయం కోసం 66 ఏళ్లపాటు ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున లీజుపై ఇచ్చేందుకు ఆమోదం. 

»   ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ పాలసీ 2026–2031కు ఆమోదం. 

»  తిరుపతి జిల్లా శ్రీసిటీలో ‘శ్రీ సిటీ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు కోసం ‘ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ చట్టం–2016’ షెడ్యూల్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం.  

» గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మొత్తం ట్యాంక్‌ పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నందున ఆ రికార్డులను గ్రామ కంఠంగా మార్చేందుకు అనుమతి.  

» హడ్కో నుంచి ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూ.300 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వ హామీ ఇస్తూ జారీ చేసిన జీవోకు ఆమోదం.  

» రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోలార్‌ ప్లాంట్లకు, రాజధానిలో కొన్ని సంస్ధలకు భూముల కేటాయింపులకు ఆమోదం.
సర్కారు భవనాల సోకుల కోసం రూ.547.07 కోట్లు, ఐఏఎస్‌ భవనాల హంగులకు రూ.94.90 కోట్లను వ్యయం చేసేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా రెండేళ్లు కాలక్షేపం చేసింది. అమరావతి పేరుతో లగ్జరీల కోసం రూ.వేల కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ భారీ దోపీడికి పాల్పడుతోంది. 

డబ్బుల్లేవంటూ గత ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను నిలుపుదల చేసిన ప్రభుత్వం అమరావతి పేరుతో రూ.వేల కోట్లను సంతర్పణ చేస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తి అయ్యేవి. ప్రాధాన్యత గల పనులు చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం భారీగా వ్యయం చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంపై ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement