గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత

Responsibility for street lighting for village secretariats - Sakshi

31 నుంచి అధికారికంగా బదలాయింపు 

అదనంగా 4 లక్షల వీధిలైట్ల ఏర్పాటు 

నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక పోర్టల్‌ 

48 గంటల్లో ఫిర్యాదుల పరిష్కారం 

‘పల్లె వెలుగు’కు ప్రభుత్వం పెద్దపీట 

రాష్ట్ర విద్యుత్‌ శాఖ వెల్లడి 

సాక్షి, అమరావతి: పల్లెల్లోని ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించబోతున్నారు. ఈ నెల 31న అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సేవలను ‘జగనన్న పల్లె వెలుగు’ పేరుతో ప్రజల ముంగిటకే తెస్తున్న సర్కారు.. రాత్రి వేళ ప్రతీ వీధి దీపం వెలగాలన్న లక్ష్యంతోనే కీలక అడుగువేసిందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ. చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీధి దీపాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

నిర్వహణ లోపాలతో.. 
కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) 10,382 గ్రామ పంచాయతీల్లో 23.29 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసింది. ఈ పథకం కిందలేని 2,303 గ్రామ పంచాయతీల్లోనూ అదనంగా 4 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకూ వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎస్‌ఎల్‌ నియమించిన కాంట్రాక్టు సంస్థ పరిధిలో ఉండేది. కానీ, దీనివల్ల అనేక సమస్యలొస్తున్నాయి. వెలగని, కాలిపోయిన వీధి దీపాలను మార్చడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో కారుచీకట్లు నెలకొంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. వీటిపై ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో 7 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

48 గంటల్లోనే రిపేర్‌ 
వీధి దీపాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వెలగని వీధి దీపంపై ఈ పోర్టల్‌ ద్వారా  ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వీధి దీపాల పోర్టల్‌ లింక్‌ అయి ఉంటుంది. వీటిద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎనర్జీ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు పరిశీలించి తక్షణమే స్పందిస్తారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో దానిని రిపేర్‌ చేయాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఇక కాలిపోయిన, చెడిపోయిన లైట్లను మార్చుకునేలా ప్రతీ పంచాయతీ పరిధిలో కొన్ని లైట్లు అందుబాటులో ఉంచనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top