మైనర్ల పాస్‌పోర్ట్‌పై ఒంటరి తల్లికి ఊరట | Relief for single mother over minors passports | Sakshi
Sakshi News home page

మైనర్ల పాస్‌పోర్ట్‌పై ఒంటరి తల్లికి ఊరట

Jun 6 2026 5:08 AM | Updated on Jun 6 2026 5:08 AM

Relief for single mother over minors passports

తండ్రి సంతకం, విడాకుల పత్రాలు అవసరం లేదు 

అవి లేకుండానే పిల్లల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే హక్కు ఆమెకు ఉంది 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక తీర్పు

సాక్షి, అమరావతి: మైనర్‌ బిడ్డల పాస్‌పోర్ట్‌ విషయంలో ఇబ్బందులు పడుతున్న ఒంటరి తల్లులకు ఊరటనిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త సమ్మతి లేదా సంతకం లేకుండానే మైనర్ల పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే పూర్తి హక్కు ఒంటరి తల్లికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా కోర్టు నుండి లేదా సమర్థ అధికారి నుంచి ఎటువంటి నిషేధాజ్ఞలు లేని సందర్భాల్లో తండ్రి సమ్మతి లేకుండా, కేవలం తల్లి సమర్పించిన దరఖాస్తు ఆధారంగా మైనర్‌ బిడ్డకు పాస్‌పోర్ట్‌ జారీ చేయవచ్చా.. లేదా? అన్న ప్రశ్నకు హైకోర్టు ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. 

పిటిషనర్‌ కుమార్తె పాస్‌పోర్ట్‌ దరఖాస్తును పరిశీలించి, రెండు వారాల్లో పాస్‌పోర్ట్‌ జారీ చేయాలని ఈ వ్యాజ్యంలో విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిని  హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. సదరు ఒంటరి తల్లి ఇప్పటికే దరఖాస్తుతో పాటు చట్ట నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన ’అనెక్సర్‌–సి’, ’అనెక్సర్‌–డి’ పత్రాలను సమర్పించారని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని కూడా తెలియజేశారని, ఈ నేపథ్యంలో విడాకుల పత్రాల కోసం పాస్‌పోర్ట్‌ అధికారులు పట్టుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. 

ఈ వ్యాజ్యంలో తన 4 ఏళ్ల కుమార్తెకు పాస్‌పోర్ట్‌ కోసం ఒక మహిళ గత ఏడాది ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్‌ అధికారులు ఆమె భర్త సంతకం లేదా కోర్టు నుండి విడాకులు/న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని మౌఖికంగా ఒత్తిడి చేస్తూ పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియను నిలిపివేశారు. దీనిని సవాలు చేస్తూ షేక్‌ షబానా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement