టీడీపీ నేతల ఆక్రమణలకు చెక్‌ | Redemption of 3426 acres of govt land in Chittoor district from TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఆక్రమణలకు చెక్‌

May 30 2021 5:00 AM | Updated on May 30 2021 7:57 AM

Redemption of 3426 acres of govt land in Chittoor district from TDP Leaders - Sakshi

చిట్టడవిగా ఉన్న శోత్రియ భూములు

సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు ఆక్రమించిన ప్రభుత్వ భూములకు విముక్తి లభించింది. చిత్తూరు జిల్లాలో ఏళ్ల తరబడి టీడీపీ నేతల కబంధహస్తాల్లో ఉన్న 2,887.73 ఎకరాలను ప్రభుత్వ భూములుగా చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు ధ్రువీకరించారు. అలానే జిల్లాలోని 78 గ్రామాల్లో 538.29 ఎకరాల భూమికి సంబంధించిన అక్రమ డీకేటీ పట్టాలను రద్దు చేశారు. ఈ రెండేళ్ల కాలంలో అక్రమార్కుల చెర నుంచి కోట్లాది రూపాయల విలువైన 3,426 ఎకరాల ప్రభుత్వ భూములకు విముక్తి లభించింది. జిల్లాలో చంద్రబాబు సొంత తమ్ముడి మొదలు.. నాటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తల వరకూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. వాటిలో ముఖ్యంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, తిరుపతి పరిధిలోనే అధికంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అనుచరులు, లోకేశ్‌ అనుచరులు ప్రభుత్వ, పోరంబోకు, అటవీ భూములను విచ్చలవిడిగా ఆక్రమించారు. నాటి రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ దురాక్రమణలకు ఒడిగట్టారు. ఈ ఆక్రమణలను పలుమార్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. 

సోత్రియ భూములే వారి టార్గెట్‌
సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ హయాంలో వందలాది ఎకరాల్లో శ్రీసిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. అక్కడ భారీ పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గ పరిధిలోని భూముల ధరలు రూ.కోట్లకు చేరాయి. వైఎస్సార్‌ మరణానంతరం సత్యవేడు పరిధిలోని ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, అటవీ భూములను ఆక్రమించుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా విలువైన సోత్రియ భూములను టార్గెట్‌ చేశారు. 1956లో ఈ భూములు మద్రాస్‌ రాష్ట్రం చెంగల్‌పట్టు జిల్లా పొన్నేరు తాలూకాలో ఉండేవి. 1960లో ఎస్టేట్‌ అబాలిష్‌ యాక్ట్‌ కింద అప్పట్లో ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. ఆ భూములను సోమయాజులు నుంచి చెంగమనాయుడు కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు.

అనంతరం చెంగమనాయుడు రక్తసంబంధీకుడు కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులు 17 మంది రంగంలోకి దిగారు. వారిలో ఓ పారిశ్రామికవేత్త కూడా ఉన్నాడు. సోత్రియ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సేకరించారు. వాటికి రైత్వారీ పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. రైత్వారీ పట్టా వీలు కాకపోవటంతో డూప్లికేట్‌ పట్టాలు సృష్టించి చెన్నైలోని ఓ బ్యాంక్‌లో ఆ భూములను తాకట్టు పెట్టి రూ.15 కోట్లు తీసుకున్నట్టు తెలిసింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో జేసీ మార్కండేయులు శాటిలైట్‌ ద్వారా సోత్రియ భూములను సర్వే చేసి వాటిని ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. 

ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఆక్రమణకు గురైన 3,426 ఎకరాల ప్రభుత్వ, అటవీ, పోరంబోకు తదితర భూములను ప్రభుత్వ భూములుగా ధ్రువీకరించాం. వీటిని ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తాం. ఈ భూముల్లో 1052 ఎకరాల సోత్రియ భూములను ఏపీఐఐసీకి కేటాయించనున్నాం.  
– మార్కండేయులు, జాయింట్‌ కలెక్టర్, చిత్తూరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement