AP: కోలుకుంటున్న విమానయానం

Recovering Aviation Of flight services In Andhra Pradesh - Sakshi

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 376% పెరిగిన ప్రయాణికులు

271% పెరిగిన విమాన సర్వీసుల సంఖ్య

6 ఎయిర్‌ పోర్టులకు పెరుగుతున్న ఆదరణ

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభం నుంచి రాష్ట్ర విమానయాన రంగం వేగంగా కోలుకుంటోంది. కోవిడ్‌ తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యలో 375.68 శాతం వృద్ధి నమోదైంది. విమాన సర్వీసుల సంఖ్యలో 271 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం ఆరు విమానాశ్రయాలు ఉండగా.. గతేడాది మొదటి మూడు నెలల్లో 1,933 సర్వీసులు నడిస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్య 7,174కు చేరింది. ఇదే సమయంలో ప్రయాణికుల సంఖ్య 89,758 నుంచి 4,26,969కి చేరింది.

తిరుపతికి పెరిగిన డిమాండ్‌
తిరుమలలో దర్శనాలకు అనుమతించడంతో తిరుపతి విమాన సర్వీసులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. గతేడాదితో మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది విమాన సర్వీసుల్లో 530 శాతం, ప్రయాణికుల సంఖ్యలో 690 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మూడు నెలల్లో తిరుపతికి కేవలం 186 సర్వీసులు మాత్రమే నడవగా.. ఈ సారి ఆ సంఖ్య 1,172కు చేరుకుంది. ప్రయాణికుల సంఖ్య 7,272 నుంచి ఏకంగా 61,079కి పెరిగింది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి కూడా సర్వీసులు బాగానే నడుస్తున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి 282 సర్వీసుల నడవగా 6,118 మంది ప్రయాణించారు.

గతంతో పోలిస్తే విమాన సర్వీసుల సంఖ్య పెరిగినప్పటికీ ఇంకా కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు విశాఖ నుంచి రోజుకు సగటున 7 వేల మంది వరకు ప్రయాణించేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 2,500 నుంచి 3,000కు చేరుకుందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ కృష్ణ కిషోర్‌ తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమై, థర్డ్‌ వేవ్‌ ముప్పు లేకపోతే త్వరలోనే విమానయాన రంగం కోవిడ్‌ పూర్వస్థితికి చేరుతుందన్న ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top