West Godavari: 5.50 లక్షల ఎకరాల భూమి రీ సర్వే 

Re Survey Of 5 Lakh Above Acres Of Land In West Godavari District - Sakshi

కలెక్టర్‌ పి.ప్రశాంతి వెల్లడి 

ఆకివీడు(ప.గో. జిల్లా):  జగనన్న సంపూర్ణ భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో రీ సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ పి.ప్రశాంతి చెప్పారు. మండలంలోని చినమిల్లిపాడు శివారు కొత్త చెరువు ప్రాంతంలో గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్‌(సర్వే రాయి)ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ భూహక్కు రీ సర్వే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పారు. సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా రీ సర్వే పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

ఆకివీడు, కాళ్ల మండలాల్లో డ్రోన్‌ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ముందుగా ఆకివీడు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల జిల్లా అధికారి కె.జాషువాను ఆదేశించారు. ఆకివీడు మండలంలో 15 గ్రామాల్లో 2,9971.29 ఎకరాల భూమి రీ సర్వే చేయాల్సి ఉందని, దానిలో ఇంతవరకూ మూడు గ్రామాల్లో 492.46 ఎకరాల భూమి రీ సర్వే చేయించామని కలెక్టర్‌ చెప్పారు. కాళ్ల మండలంలో 13 గ్రామాల్లో 3,6561.69 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉండగా 2 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయిందన్నారు. గ్రామాల్లో సర్వే చేస్తున్న సమయానికి ముందుగా గ్రామస్తులందరికీ సర్వే గురించి తెలియజేయాలని కలెక్టర్‌ సర్వే అధికారులను ఆదేశించారు.  

పీహెచ్‌సీ వైద్యులపై ఆగ్రహం 
మండలంలోని పెదకాపవరం గ్రామంలో పీహెచ్‌సీని కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రెగ్యులర్‌ డాక్టర్‌ సెలవులో ఉండటం, ఇన్‌చార్జి డాక్టర్‌ విధులకు రాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు డాక్టర్లు సెలవులో ఉంటే ఓపీ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. ప్రతీ రోజూ రోగులు ఎంత మంది వస్తున్నారు,  డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి,

వాటిలో ఫ్రీ డెలివరీ కేసులెన్ని అని సిబ్బందిని ప్రశ్నించారు. ఫ్యామిలీ డాక్టర్‌ సేవల్ని గ్రామాల్లో విస్తరింపజేయాలని కలెక్టర్‌ హెచ్చరించారు. తొలుత గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు–నేడు పనుల్ని పరిశీలించారు. ఫేస్‌–2లో పాఠశాలలో జరగుతున్న పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. స్కూల్‌లోని ల్యాబ్‌ను పరిశీలించి, ఇటీవల పంపిణీ చేసిన ట్యాబ్‌లను ఏవిధంగా ఉపయోగిస్తున్నారని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కఠారి జయలక్ష్మీ, సర్పంచ్‌లు ఊసల బేబీ స్నేతు, ఎన్‌.రామరాజు, డీఈఓ వెంకటరమణ, తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీకర్, ఎంఈఓ రవీంద్ర, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top