Fact Check: ఇంత వక్రీకరణా?  | Sakshi
Sakshi News home page

Fact Check: ఇంత వక్రీకరణా? 

Published Tue, Jan 30 2024 5:37 AM

Ramoji Rao Eenadu Fake News on fisherman died - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే అజెండాగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు తన మార్కు దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి చూపించారు. పల్నాడు జిల్లాలో ఓ మత్స్యకారుని అనుమానాస్పద మృతికి కూడా వక్రభాష్యం చెబుతూ పోలీసు శాఖపై విష ప్రచారం చేశారు. పోలీసుల వేధింపులతోనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నారని నిరాధార కథనాన్ని ప్రచురించి పాఠకులను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్‌కే వెళ్లని వ్యక్తిని ఎస్సై ఎలా వేధింపులకు గురిచేస్తాడని, వేధింపులకు గురైన వ్యక్తి చేపల వేటకు వెళ్తాడా అన్న కనీస జ్ఞానం కూడా ఈనాడుకు లేదు. అందుకే ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తికి చెందిన మత్స్యకారుడు చౌడిపల్లి దుర్గారావు గతంలో అక్రమ మద్యం కేసులో నిందితుడు. ఆయన తన నాటు పడవలో మరి­కొం­దరితో కలిసి తెలంగాణ నుంచి పడవలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌­ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు, మరో నిందితుడు పరారయ్యారు. అక్రమ మద్యం కేసులో దుర్గారావును ఐదో నిందితుడు (ఏ5)గా పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం దుర్గారావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందారు. ఆది­వారంతో సహా ప్రతి రోజూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, గత 3 ఆదివారాలు ఆయన పోలీస్‌ స్టేష­న్‌కు వ­చ్చి సంతకం పెట్టలేదు. గత ఆదివారంనాడు (జన­వరి 28న) కూడా పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా చేపల వేట కోసం కృష్ణా నదిలోకి వెళ్లాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుర్గారావు మృతదేహా­న్ని ఆయన బావమరిది బ్రహ్మాజీ తీసుకువచ్చారు.

మృతిపై భిన్న వాదనలు
దుర్గారావు మృతి పట్ల ప్రత్యక్ష సాక్షులు భిన్నమైన వాదనలు వినిపించడం గమనార్హం. మొదట కృష్ణా నది ఒడ్డున దుర్గారావు మృతదేహాన్ని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాసేపటికే దుర్గారావు మృతదేహాన్ని కృష్ణా నది నుంచి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఆయన మెడకు ఉరివేసుకుని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కాగా నది నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తున్నప్పుడు సెల్‌ ఫోన్‌ కెమెరాలతో తీసిన వీడియోలో ఆయన మెడకు ఎలాంటి తాడూ లేదు. కానీ కాసేపటికి దుర్గారావు మెడ చుట్టూ తాడు బిగించి ఉన్నట్టు ఫొటోలు బయటకు వచ్చాయి.

దీనిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గారావు మెడకు మొదట పసుపు రంగు తాడు లేదని, తరువాతే చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నేర చరిత్ర ఉన్న టీడీపీ నేతలు రెడ్యా నాయక్, వజ్ర నాయక్‌ మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి వెల్దుర్తి ఎస్సై శ్రీహరి వేధింపుల వల్లే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు చేయించారు. సోదరులైన వారిద్దరిపై పలు క్రిమినల్‌ కేసులు ఉండటం గమనార్హం. వారిద్దరే దుర్గారావు కుటుంబ సభ్యులతో జాతీయ రహదారిపై ధర్నా చేయించారు.

వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరిస్తూ ఈనాడు పోలీసులపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించడం గమనార్హం. ఇవి వాస్తవాలు కాగా, ఎస్సై వేధింపుల వల్లే దుర్గారావు మృతి చెందాడని వక్రీకరిస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దుర్గారావు అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్‌కే వెళ్లలేదు. అతన్ని పోలీసులు వేధింపులకు గురిచేస్తే మానసిక వ్యధతో ఉన్న వ్యక్తి పడవలో చేపల వేటకు వెళ్లగలడా? ఈ కనీస జ్ఞానం తప్పుడు కథనం రాసే వారికి ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కేసు నమోదు... దర్యాప్తు
దుర్గారావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన ఎలా మృతి చెందారనే విషయంపై ప్రత్యక్ష సాక్షులే పరస్పర భిన్నమైన కారణాలు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావల్సి ఉంది. మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు శాఖాపరమైన దర్యాప్తు కూడా చేపట్టారు. వెల్దుర్తి ఎస్సై శ్రీహరికి మెమో జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని మాచర్ల సీఐ షమీముల్లాను ఆదేశించారు.    

Advertisement
Advertisement