తప్పు ఆస్పత్రిదే

Ramesh Hospital is negligent at every step in the management of Covid Care Center - Sakshi

కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణలో రమేష్‌ ఆస్పత్రి అడుగడుగునా నిర్లక్ష్యం

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ

రెండింటికి అనుమతి తీసుకుని నాలుగు కేంద్రాల నిర్వహణ

సరైన ప్రమాణాలు లేని హోటళ్లలో క్వారంటైన్‌ కేంద్రాలు

రోగుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఫీజుల వసూలు.. ఐసీఎంఆర్‌ నిబంధనలు బేఖాతరు

లక్షణాలు లేకున్నా ఖరీదైన వైద్యం

రమేష్‌ ఆస్పత్రి కోవిడ్‌ కేర్‌ సెంటర్ల అనుమతుల రద్దు 

ఇకపై కరోనా రోగులకు చికిత్స అందించవద్దని ఆదేశాలు

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: కరోనా బూచి చూపించి విజయవాడ రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం బాధితుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ.. బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. అనుమతులు లేకుండా క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు.. భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం.. వైద్య ప్రమాణాల పట్ల అలక్ష్యం.. ఖరీదైన వైద్యం మాటున దోపిడీ.. ఇలా దేనికీ అంతనేది లేకుండా వ్యవహరించింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్‌ ఆస్పత్రికి చెందిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో పదిమంది మృతికి తప్పంతా ఆస్పత్రి యాజమాన్యానిదేనని తేలింది.

ఈ మేరకు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా రమేష్‌ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేశామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. దీంతోపాటు ఆ ఆస్పత్రికి చెందిన నాలుగు కోవిడ్‌ కేర్‌ సెంటర్ల అనుమతులు రద్దు చేసి మూసివేయించారు. కరోనాకు వైద్యం చేయొద్దని, పాజిటివ్‌ రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

అడుగడుగునా భద్రతా లోపాలు..
► స్వర్ణ ప్యాలెస్, స్వర్ణ హైట్స్‌ హోటళ్లలో 50 బెడ్స్‌ ఏర్పాటుకు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణకు రమేష్‌ ఆస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జూలై 19న అనుమతులు ఇచ్చారు. 

► అయితే అనుమతులు రాకముందే స్వర్ణ హైట్స్‌లో జూలై 13, స్వర్ణ ప్యాలెస్‌లో 15 నుంచే కరోనా రోగులకు చికిత్స అందించినట్లు కమిటీ విచారణలో తేలింది. 

► అలాగే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎం5 హోటల్‌లో జూలై 29, మెట్రోపాలిటిన్‌ హోటల్‌లో ఆగస్టు 8 నుంచి అనధికారికంగా కోవిడ్‌ కేర్‌ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. 

► వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులు పొందిన రెండు కేంద్రాలకు కూడా అగ్నిమాపక శాఖ, మున్సిపల్‌ శాఖల అనుమతుల కోసం ఆస్పత్రి యాజమాన్యం దరఖాస్తే చేయలేదు. 

► దరఖాస్తు చేసి ఉంటే సంబంధిత శాఖల అధికారులు హోటల్‌ను పరిశీలించి అసలు అనుమతులు ఇచ్చేవారే కాదు. 
► ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్‌తోపాటు మిగతా మూడు కోవిడ్‌ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల గురించి రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు.

► కనీసం అగ్నిమాపక శాఖ అనుమతి కూడా లేని హోటల్‌ను కోవిడ్‌ సెంటర్‌గా ఎంపిక చేసింది. 

► అందులో 24 గంటలూ నిపుణులైన సిబ్బందిని ఉంచలేదు. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ప్రమాదం జరిగిన ఆగస్టు 9న పొగ వస్తున్నా ఎవరూ గుర్తించనే లేదు. స్మోక్‌ అలారంలు కూడా ఏర్పాటు చేయలేదు. 

► కోవిడ్‌ కేంద్రాలుగా నిర్ణయించిన హోటళ్లలో మౌలిక, వైద్య వసతుల గురించి రమేశ్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. తరచూ కోవిడ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేయాల్సి ఉంది. దీనికి తగిన భద్రతా ప్రమాణాలు పాటించే వైద్య, విద్యుత్‌ టెక్నీషియన్లను నియమించలేదు. 

► ఆక్సిజన్‌ సిలిండర్లను కూడా ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఓ గదిలో ఉంచింది. ఆ సిలిండర్లకు మంటలు వ్యాపించకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. 

► ఏమాత్రం నైపుణ్యం లేని సిబ్బంది విద్యుత్‌ స్విచ్‌ బోర్డులు, వైర్ల మీద కూడా శానిటైజర్లు జల్లడంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో క్షణాల్లోనే మంటలు అంతటా వ్యాపించి పదిమంది మృతికి కారణమయ్యాయి. 

ఫీజుల పేరుతో దోపిడీ
► రమేష్‌ ఆస్పత్రి జీవో నంబర్‌ 77 ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు వసూలు చేయకుండా భారీ మొత్తంలో గుంజినట్టు కమిటీ గుర్తించింది. 

► రాష్ట్రంలో మరే ఆస్పత్రి వసూలు చేయనంతగా బాధితుల నుంచి పది రోజులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది.

► కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చేరే సమయంలోనే అడ్వాన్స్‌ పేరిట రూ.75 వేల నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు పేర్కొంది. 
► రూమ్‌ అద్దె, వైద్యం, టెస్ట్‌ల పేరిట రోజుకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకున్నట్లు తేలింది. 

► మరికొందరి నుంచి రోజుకు రూ.40 వేలు –రూ.60 వేల వరకు కూడా వసూలు చేసింది. 

► కోవిడ్‌ అనుమానిత కేసుకు కూడా రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బాదింది. 

► బి.సుజాత అనే ఆమె నుంచి ఒక రోజు చికిత్సకు రూ.లక్షతోపాటు నాలుగు బంగారు గాజులను కూడా తీసుకుంది. నిబంధనల మేరకు రోజుకు రూ.8,250 తీసుకోవాల్సి ఉండగా సుజాత నుంచి రూ.91,750 అదనంగా తీసుకోవడంతోపాటు నాలుగు బంగారు గాజులను ఫీజు కింద వసూలు చేసింది. 

► వి.హనుమంతరావు అనే వ్యక్తి 5 రోజులు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉన్నారు. దీనికి ఫీజు కింద రూ.41,250 తీసుకోవాల్సి ఉండగా రూ.1,84,301 పిండుకున్నారు.  

► టి.స్వర్ణలత, పి.కృష్ణమోహన్, కె.శివప్రసాద్‌ అనే వ్యక్తులకు కోవిడ్‌ లేదు. కనీసం కోవిడ్‌ లక్షణాలు లేకపోయినా వారిని ప్రమాదం జరగడానికి ముందు కోవిడ్‌ సెంటర్‌లో చేర్చుకుంది. 

► అగ్నిప్రమాదంలో మరణించిన పదిమందిలో ఎనిమిదిమంది కరోనా నెగెటివ్‌ వ్యక్తులే. 
► రోగుల అడ్మిషన్, డిశ్చార్జ్‌ వివరాలను కూడా జిల్లా యంత్రాంగానికి తెలపలేదు.

► కాగా, రమేష్‌ ఆస్పత్రి నిర్వహణలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నుంచి 215 మంది డిశ్చార్జ్‌ అయినట్లు కమిటీ గుర్తించింది.
►అగ్నిప్రమాదం జరిగాక ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్‌ యాజమాన్యాలు రెండూ జిల్లా యంత్రాంగానికి సహకరించలేదు. అంతేకాకుండా జవాబుదారీతనంతో వ్యవహరించలేదని పేర్కొంది.

రెమిడెసివర్‌ అవసరం లేకపోయినా..
► ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగి వారిలో ఓ మోస్తరు లక్షణాలుంటేనే క్వారంటైన్‌ సెంటర్లకు తేవాలి.

► అయితే.. రమేష్‌ ఆస్పత్రి కోవిడ్‌ టెస్టులు చేయకుండానే, లక్షణాలు లేకుండానే బాధితులను క్వారంటైన్‌ కేంద్రాల్లో చేర్చుకుంది. 

► ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం లక్షణాలు తీవ్రంగా ఉంటేనే రెమిడెసివర్‌ ఇవ్వాల్సి ఉండగా లక్షణాలు లేకున్నా పలువురు రోగులకు రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ ఇచ్చింది.  

► ఆ రోగులకు ఇంజక్షన్‌ అవసరం లేదని, కొంతమందికి ఇవ్వకుండానే ఇచ్చినట్టు బిల్లుల్లో పొందుపరిచిందని కమిటీ గుర్తించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top