రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

Ramakrishna bail petition postponed - Sakshi

మరికొన్ని రోజులు జైల్లో ఉండటం మేలన్న హైకోర్టు

సీఎంపై రామకృష్ణ పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు

న్యాయాధికారి అయి ఉండి టీవీ చర్చల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం

హైకోర్టుకు నివేదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసరెడ్డి

సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి సంకు రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. ఒక దశలో ఈ పిటిషన్‌ను కొట్టేసేందుకు సిద్ధపడ్డ హైకోర్టు.. రామకృష్ణ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కొన్ని తీర్పులను కోర్టు ముందుంచేందుకు గడువు కోరడంతో విచారణను వాయిదా వేసింది. ఆయన మరికొన్ని రోజులు జైల్లో ఉండటమే మేలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌ చర్చలో పాల్గొన్న రామకృష్ణ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాక్షసుడిగా, కంసుడిగా అభివర్ణిస్తూ తల నరకాలని పిలుపునిచ్చారు.

సీఎంను అంతం చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో రామకృష్ణపై అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌ కోసం గత నెలలో ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు వాదనలు విన్నారు. రామకృష్ణ తరఫున దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై పెట్టిన రాజద్రోహం కేసు చెల్లదన్నారు.  తరువాత పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె. శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ.. న్యాయాధికారి అయిన రామకృష్ణ సస్పెన్షన్‌లో ఉన్నారన్నారు.

ప్రభుత్వోద్యోగి అయి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇలా ఇప్పటికే పలుమార్లు చర్చల్లో పాల్గొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. న్యాయాధికారిగా ఉంటూ టీవీ చర్చల్లో పాల్గొనడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ రామకృష్ణ మరిన్ని రోజులు జైల్లో ఉండటమే మేలని వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top