పేదలందరికీ నాణ్యమైన బియ్యం

Quality rice for all the poor people in AP - Sakshi

అక్టోబర్‌ నుంచి లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం

లబ్ధి పొందనున్న 1.49 కోట్ల కుటుంబాలు

సాక్షి, అమరావతి: వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కేటాయిస్తోంది. 1982–83లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం 2.55 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే కేటాయించగా ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఏడాది 28.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించింది. రాష్ట్రంలో ఎవరూ ఆకలి, పోషకాహార లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో కార్డు కావాలంటే పేదలు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతలు ఉంటే గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తున్నారు. 

► రాష్ట్రంలో 1.49 కోట్ల కుటుంబాలకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. 
► కార్డుదారులతోపాటు మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలు, ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థుల భోజనం కోసం ప్రభుత్వం బియ్యం కేటాయిస్తోంది. 
► దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా అక్టోబర్‌ నుంచి లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద గతేడాది సెప్టెంబర్‌ నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తోంది. 
► ఈ ఏడాది రాష్ట్రం అంతటా నాణ్యమైన బియ్యాన్ని ఇళ్లకే పంపిణీ చేయడం వల్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో వారికి కష్టాలు పూర్తిగా తప్పనున్నాయి.
► నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.1,500 కోట్లు భారం పడుతుందని అంచనా. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top