23 నుంచి ‘జగనన్న విద్యాకానుక’ వారోత్సవాలు

Quality Inspection Of Jagananna Vidya Kanuka Kits - Sakshi

రూ.650 కోట్ల పథకం సమర్థంగా అమలయ్యేలా చర్యలు

విద్యాకానుక కిట్ల నాణ్యత పరిశీలన

లోపాలు సరిదిద్దేందుకు ఏర్పాట్లు 

వచ్చే ఏడాదికి మరింత మెరుగుపరిచేలా ప్రణాళిక

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యాకానుక’ ఫలాలు పాఠశాలల విద్యార్థులందరికీ అంది పథకం లక్ష్యాలు పూర్తిగా నెరవేర్చేందుకు విద్యాశాఖ ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రూ.650 కోట్లకు పైగా వెచ్చించి 2020–21 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, ఒక సెట్‌ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, మూడు మాస్కులు, బ్యాగ్‌ను కిట్‌ రూపంలో అందించారు. ఈ కిట్లలో ఇచ్చినవస్తువుల నాణ్యతను, పంపిణీ విధానాన్ని వారోత్సవాల సందర్భంగా పరిశీలించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే నాటికే పథకాన్ని మరింత మెరుగైన ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

రూ.150 కోట్ల కుట్టు కూలి 
విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలి కింద 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జతకు రూ.40 చొప్పున రూ.120, 9, 10 తరగతుల విద్యార్థులకు జతకు రూ.80 చొప్పున 3 జతలకు రూ.240 నగదును విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. దాదాపు 42 లక్షలమంది విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం రూ.150 కోట్ల వరకు కుట్టు కూలి చెల్లిస్తోంది. గతంలో దుస్తుల కుట్టు కాంట్రాక్టు పేరిట ఈ డబ్బు భారీగా స్వాహా అయ్యేది. ఇప్పుడు ఒక్క పైసా కూడా దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోనే వేస్తున్నారు. ఎవరికైనా కుట్టు కూలి జమకాకపోతే ఈ వారోత్సవాల్లో తల్లుల ఆధార్‌ డేటాను పరిశీలించి వివరాలు తప్పుగా ఉంటే సరిచేస్తారు. బూట్లు, బ్యాగుల్లో సమస్యలుంటే సంబంధిత ఏజెంట్లతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తారు.

వారోత్సవాల షెడ్యూల్‌
23వ తేదీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ‘జగనన్న విద్యాకానుక’ గురించి అవగాహన కల్పించడం. ప్రతి విద్యార్థికి స్టూడెంట్‌ కిట్‌ అందిందా లేదా పరిశీలించడం. బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ తనిఖీ 

24వ తేదీ విద్యార్థులు యూనిఫాం కుట్టించుకున్నారో లేదో పరిశీలించడం. కుట్టు కూలి ఖర్చులు తల్లుల ఖాతాలకు జమచేస్తున్న విషయాన్ని తెలపడం. దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తలపై అవగాహన కల్పించడం. 

25వ తేదీ విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం. బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం. 

26వ తేదీ విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం. బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం. 

26వ తేదీ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ పుస్తకాలకు అట్టలు వేసుకోవడం, పుస్తకాలను ఉపయోగించుకోవడంపై అవగాహన కల్పించడం. 

27వ తేదీ బ్యాగులు వాడే విధానం, పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి అవగాహన కల్పించడం. బ్యాగుల విషయంలో ఏవైనా సూచనలుంటే అధికారుల దృష్టికి తీసుకురావడం.

28వ తేదీ జగనన్న విద్యాకానుక కిట్‌లో అన్ని వస్తువులు అందాయా లేదా తెలుసుకోవడం, బయోమెట్రిక్‌ సరిగా ఉందో లేదో పరిశీలించడం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top