వెంకన్న లడ్డూకు‘అనంత’ పప్పుశనగ

Pulses from Ananthapur for TTD Laddu - Sakshi

ప్రకృతి సేద్యంతో పండించిన 1,396 క్వింటాళ్లు సేకరణ

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందలదిన్నెలో 185 ఎకరాల్లో పంట సాగు

పంట నూర్పిడి తర్వాత ఈ నెలాఖరుకు తిరుమలకు రవాణా

మార్కెట్‌ రేటు కన్నా 20 శాతం అదనంగా ధర ఇవ్వనున్న టీడీటీ 

అనంతపురం అగ్రికల్చర్‌ :  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతిఒక్కరూ పరమపవిత్రంగా భావిస్తారు. అంతటి మహిమాన్వితమైన లడ్డూ తయారీకి అవసరమైన పదార్ధాల్లో చక్కెర, నెయ్యితో పాటు శనగపిండి కూడా ముఖ్యమైనది. ఇప్పుడా శనగపిండికి అవసరమైన పప్పుశనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. అంటే లడ్డూ తయారీలో అక్కడి రైతులు పండిస్తున్న పప్పుశనగకు భాగస్వామ్యం దక్కుతోంది. పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన పంటను సేకరించడానికి టీటీడీ సైతం చర్యలు చేపట్టింది. ప్రకృతి వ్యవసాయ విభాగం (జెడ్‌బీఎన్‌ఎఫ్‌) డీపీఎం లక్ష్మానాయక్‌ సహకారంతో ఈనెలాఖరున అవసరమైన పప్పుశనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 

1,396 క్వింటాళ్లకు టీటీడీ ఆర్డర్‌
జెడ్‌బీఎన్‌ఎఫ్‌ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో సాగుచేసిన 185 ఎకరాల్లోని దిగుబడి ఆధారంగా 1,396 క్వింటాళ్ల పప్పుశనగకు ఇటీవల టీటీడీ నుంచి ఆర్డర్‌ వచ్చినట్లు డీపీఎం లక్ష్మానాయక్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇక్కడి రైతులు ఎకరాకు 400 కిలోలు ఘన జీవామృతం, బీజామృతంతో విత్తనశుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేసి పప్పుశనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి లాంటి వాటితో తయారుచేసిన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ పోషకాలు వాడుతున్నారన్నారు.

పప్పుశనగలో అంతర పంటలుగా సజ్జ, అనుము, అలసందతో పాటు ఆవాలు కూడా వేశారన్నారు. అందువల్లే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు నాణ్యమైన పప్పుశనగ దిగుబడులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈనెలాఖరున పంట తొలగించి నూర్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్వింటా ఎంతలేదన్నా రూ.7 వేలకు తక్కువ కాకుండా పలికే అవకాశం ఉందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదం తయారీకి తాము పండించిన పప్పుశనగ వినియోగించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని డీపీఎం లక్ష్మానాయక్‌ వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top