
దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోండి
డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను కోరిన ‘సాక్షి’ ప్రతినిధుల బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక, టీవీ కార్యాలయాలు, ఆ సంస్థ పాత్రికేయులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, గూండాల దాడులను వెంటనే అరికట్టాలని ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధుల బృందం డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తాను కోరింది. పన్నాగం ప్రకారం దాడులకు దిగుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీని ఉద్దేశించిన వినతిపత్రాన్ని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మధుసూదన్‌రెడ్డికి సమర్పించింది.
‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులు బుధవారం మధుసూదన్‌రెడ్డిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో తమ సంస్థ కార్యాలయాలపై కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని వివరించారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంతో పాటు శ్రీకాకుళం, రాజానగరం, మంగళగిరి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు తదితర నగరాల్లో ‘సాక్షి’ పత్రిక యూనిట్, ప్రాంతీయ కార్యాలయాలపై జరిగిన దాడుల తీవ్రతను తెలియజేశారు.
బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా... మహిళలు, పిల్లలు, ఇతర వర్గాల గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించలేదని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుట్రపూరితంగా కొందరు పత్రిక కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారని అదనపు డీజీ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దాడులకు పాల్పడినవారిపై ఇప్పటికే ఆధారాలతో సహా సమర్పించిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరారు. ‘సాక్షి’ ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ‘సాక్షి’ కార్యాలయాలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు.