త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ 

Probation to Secretariat employees soon - Sakshi

ఉద్యోగులు రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదు

గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌

నెల్లూరు (అర్బన్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఇష్టంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు త్వరితగతిన ప్రొబేషన్‌  పీరియడ్‌ను డిక్లేర్‌ చేసి పీఆర్సీ అమలు చేయనున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. నెల్లూరులో పలువురు సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి, తమకు ప్రొబేషన్‌ పీరియడ్‌ డిక్లేర్‌ చేయాలంటూ స్థానిక కలెక్టరేట్‌లో అజయ్‌జైన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యపాలన తీసుకుని రావడంలో భాగంగా రాష్ట్రంలో ఒకే దఫా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని  చెప్పారు.

వారికి ప్రొబేషన్‌ పీరియడ్‌ డిక్లేర్‌ చేసేందుకు లెక్కలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్‌మెంట్‌ పరీక్ష పాసయిన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తారని చెప్పారు. ఎక్కువ శాఖల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జూన్‌నాటికి డిక్లేర్‌ చేస్తామని తెలపగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ముందుగా వీలైనంత త్వరగా ప్రొబేషన్‌ పీరియడ్‌ డిక్లేర్‌ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు.

సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంలో తప్పులేదని, విధులు బహిష్కరించి రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదని చెప్పారు. ఎవరో రెచ్చగొడితే ఇలా రోడ్డెక్కితే అంతిమంగా సచివాలయ ఉద్యోగులకే నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా విధులకు హాజరై ప్రజలకు మంచిగా సేవలందించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వందశాతం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top