
ఫొటోతో పాటు జియో ట్యాగింగ్ వివరాలు అప్‌లోడ్ చేయాలి
కూటమి ప్రభుత్వం హడావుడిగా మరో కార్యక్రమానికి శ్రీకారం
మద్యం షాపుల వివరాలతో ఏం ప్రయోజనమంటూ ఉద్యోగ సంఘాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో పనిభారం విపరీతంగా పెరిగిపోయి ,తీవ్ర ఒత్తిడిలో ఉన్న గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం మరింత భారం వేసింది. నకిలీ మద్యం తయారీతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫొటోలు తీసే బాధ్యతలను అప్పగించింది. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ, పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్ సెక్రటరీలు వారి పరిధిలో ఉండే (లైసెన్స్‌డ్) మద్యం షాపులను ఫొటోలు తీయడంతో పాటు షాపు జియో కోఆర్డినేట్స్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలంటూ ఆదేశాలు వెళ్లాయి.
మంగళవారం ఉదయాన్నే పలు జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ సెక్రటరీలకు సమాచారమిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిలో వేరొక పురుష ఉద్యోగి ఆ బాధ్యతలు చేపట్టాలని సూచించారు.
దీంతో ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగులతో మద్యం షాపుల ఫొటోలు తీయించడం ఏంటని మండిపడుతున్నాయి. దీనివల్ల ఏం ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెల్టుషాపుల కట్టడికి చర్యలు మానేసి ఇంత హడావుడిగా జియో ట్యాగింగ్ ఎందుకు చేయిస్తున్నారని విమర్శిస్తున్నాయి.