
డైరెక్టర్‌ను కలిసి సమాచారమిచ్చిన ఉద్యోగ సంఘాల జేఏసీ
15 రోజుల క్రితమే నోటీసిచ్చినా స్పందించని సర్కారు
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం, ఉద్యోగుల ఆత్మగౌరవ పరిరక్షణ డిమాండ్లతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగనున్నట్లు ఈనెల 8న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
సోమవారంతో గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతున్నట్లు ఐక్యవేదిక ఛైర్మన్ ఎం.డి.జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పరి నిఖిల్ కృష్ణ, కనీ్వనర్ అబ్దుల్ రజాక్ సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి సమాచారం అందచేశారు. అక్టోబరు ఐదో తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ వివరాలను ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే విజయవాడలో మరోసారి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉధృతంగా ముందుకు వెళ్లనున్నట్లు ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు.
అక్టోబర్ 5వరకు నిరసనలు ఇలా..
⇒ సెప్టెంబర్ 23 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. మధ్యాహ్నం భోజన విరామంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు.
⇒ సెప్టెంబర్ 26న భోజన విరామంలో మండల, మునిíÜపల్ కార్యాలయాల ఎదుట ప్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసనలు.
⇒ సెప్టెంబర్ 27న మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమ ర్పించి
నిరసనలు.
⇒ సెప్టెంబర్ 28న విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ. అదే రోజు 26 జిల్లాల్లో ఉద్యోగుల ఆత్మగౌరవ శంఖారావం పేరిట స్టీరింగ్ కమిటీ సమావేశాలు.
⇒ సెప్టెంబర్ 29న పెన్షన్ పంపిణీ నగదు బ్యాంకుల నుంచి డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలగాలని నిర్ణయం.
⇒ అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో ఉద్యోగుల నిరసనలు. నల్ల బ్యాడ్జీలు ధరించి లబ్ధిదారులకు పంపిణీ.
⇒ అక్టోబర్ 2న ‘మహాత్మా.. మా ఘోష విను’ అంటూ ఉద్యోగుల వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో వాట్సాప్ స్టేటస్ అప్లోడ్.
⇒ అక్టోబర్ 3న మండల, మున్సిపాలిటీల స్థాయిలో స్టీరింగ్ కమిటీల సన్నాహక సమావేశం.
⇒ అక్టోబర్ 4న జిల్లా స్టీరింగ్ కమిటీల సన్నాహక సమావేశాలు.
⇒ అక్టోబర్ 5న రాజమహేంద్రవరం వేదికగా గోదావరి జిల్లాల గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రాంతీయ సభ.
పది ఇళ్లు కూడా సర్వే చేయలేరా?
ఫుల్ స్కేల్ ఇస్తున్నాం కదా.. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
అద్దంకి: వలంటీర్ విధులతో ఇబ్బందులు పడుతున్నామని, ఆ ఇబ్బందుల నుంచి తప్పించాలని సచివాలయ ఉద్యోగులు సోమవారం బాపట్ల జిల్లా అద్దంకికి వచి్చన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. దీంతో మంత్రి మాట్లాడుతూ.. ‘ఏం చేస్తున్నారయ్యా మీరు?. గతంలో ఒక పంచాయతీ సెక్రటరీ చేసే పనిని 8 మంది చేస్తున్నారు. పదిళ్లు కూడా సర్వే చేయలేరా? గతంలో రూ.15 వేలు ఇచ్చేవారు. మేం వచి్చన తరువాత ఫుల్ స్కేల్ ఇస్తున్నాం కదా?’ అనడంతో సచివాలయ ఉద్యోగులు విస్తుపోయారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు..
⇒ పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు తగదు.
⇒ సెలవులు, పండుగలు, ఆదివారాల్లో విధుల నుంచి విముక్తి కల్పించాలి.
⇒ ఇంటింటి సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలి.
⇒ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి.
⇒ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి.
⇒ సచివాలయాల ఉద్యోగుల క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు మార్పు చేయాలి.
సమస్యలు తీర్చకపోగా పని లేదంటారా?
మంత్రి డోలా వ్యాఖ్యలను ఖండించిన జేఏసీ
తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అవమానకరంగా మాట్లాడడాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండించింది.
సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులనుద్దేశించి వారికి అసలు పని లేదని, రూ.15 వేలు జీతం వస్తున్న వారికి తాము వచ్చాక పే స్కేలు ప్రకారం జీతం ఇస్తున్నట్లు చెప్పడం సబబు కాదని జేఏసీ ఛైర్మన్ మధుబాబు, సెక్రటరీ జనరల్ జగదీష్, నేతలు హరీష్, నరసింహారావు తదితరులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు శాఖలు సచివాలయ ఉద్యోగులతో పనులు చేయిస్తూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయన్నారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ 2022లోనే ఖరారైందని, అప్పటి నుంచి వారికి పే స్కేలు ప్రకారం జీతం అందుతోందన్నారు.