రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు | Prestigious Skoch Awards for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు

Dec 20 2022 5:18 AM | Updated on Dec 20 2022 5:19 AM

Prestigious Skoch Awards for Andhra Pradesh - Sakshi

ఢిల్లీలో అవార్డును అందుకుంటున్న సెర్ప్‌ అధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం ఆరు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. సోమవారం ఢిల్లీలో స్కోచ్‌ గ్రూప్‌ నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తోంది.

అంతేకాకఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగానూ చర్యలు చేపట్టింది. తద్వారా మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద నిలబడుతున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్‌ అవార్డులు దక్కడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

పారదర్శక పౌర సేవలు.. 
దేశంలోనే ఆదర్శవంతంగా సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డు లభించింది. గుడ్‌ గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో 2021–22కి ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలో స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచర్‌ చేతుల మీదుగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ అవార్డును అందుకున్నారు.  

బ్యాంకు లింకేజీకి గోల్డ్‌ అవార్డు.. 
పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను స్కోచ్‌ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ అహ్మద్, డీజీఎం కేశవ కుమార్‌ అవార్డును అందుకున్నారు. 

స్త్రీనిధి కార్యక్రమాలకు మరో గోల్డ్‌ అవార్డు.. 
సెర్ప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ బ్యాంకులతోపాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా, అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తోంది. ఇందుకుగాను స్కోచ్‌ మరో గోల్డ్‌ అవార్డును ప్రకటించింది. స్త్రీనిధి ఎండీ కె.వి.నాంచారయ్య, డిప్యూటీ జీఎం సిద్ధి శ్రీనివాస్‌ ఈ అవార్డును అందుకున్నారు. 

జిల్లాలకు మూడు సిల్వర్‌ అవార్డులు.. 
పొదుపు సంఘాల విజయగాథలను ‘మహిళా నవోదయం’ పేరుతో ప్రతి నెలా ప్రత్యేక మాస పత్రిక రూపంలో ప్రచురించడంపై చిత్తూరు జిల్లా డీఆర్‌డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్‌ అవార్డు దక్కింది. అలాగే నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందుకు చిత్తూరు డీఆర్‌డీఏకు మరో సిల్వర్‌ అవార్డు దక్కింది. అదేవిధంగా పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్ద ఎత్తున నాటుకోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. దీనికి నెల్లూరు జిల్లా డీఆర్‌డీఏ విభాగానికి ప్రకటించిన సిల్వర్‌ అవార్డు లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement