పోతిరెడ్డిపాడు కాలువ వ్యవస్థ అభివృద్ధి పనులకు శ్రీకారం 

Potireddipadu canal system development works was started - Sakshi

రూ.1,061.69 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ 

14 వరకూ షెడ్యూళ్ల దాఖలు.. 21న టెండర్‌ ఖరారు 

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్ట్‌ జలవిస్తరణ ప్రాంతం నుంచి కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువను గోరకల్లు రిజర్వాయర్‌ బెర్మ్‌ వరకూ (0 కి.మీ. నుంచి 56.77 కి.మీ. వరకూ) అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీఆర్పీ(పోతిరెడ్డిపాడు) హెడ్‌ రెగ్యులేటర్‌.. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌(బీసీఆర్‌) కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయనుంది. ఈ పనులకు రూ.1,061.69 కోట్ల అంచనా వ్యయంతో ఓపెన్‌ విధానంలో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సోమవారం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

► ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 14న సాయంత్రం ఐదు గంటల వరకూ షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు.  
► ఈ నెల 15న ప్రీ–క్వాలిఫికేషన్‌ బిడ్‌ సమావేశాన్ని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ నిర్వహిస్తారు. షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ రూపంలో చెల్లించాల్సిన రూ.7.8 కోట్ల డీడీలను సీఈకి అందజేయాలి.  
► ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఆర్థిక (ప్రైస్‌) బిడ్‌ తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర (ఎల్‌–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్‌ చేసిన మొత్తాన్ని ‘కాంట్రాక్టు విలువ’గా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకూ ‘ఈ–ఆక్షన్‌’(రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహిస్తారు. ఈ– ఆక్షన్‌లో తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్ట్‌ సంస్థకు పనులను అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు.  
► ఈ నెల 21న ఎస్‌ఎల్‌టీసీ టెండర్‌ ప్రక్రియను పరిశీలించి, ఆమోదించి, కాంట్రాక్ట్‌ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేయడానికి అనుమతి ఇస్తుంది. 
► కృష్ణా నది నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్ట్‌లను నింపడం ద్వారా కరువును తరిమికొట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి విదితమే.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top