‘కీచకుల పార్టీగా టీడీపీ.. మహిళలపై అకృత్యాలకు బాబు సమాధానం చెప్పాలి’ 

Pothula Suneetha Serious On TDP Leaders Over Women Harassment - Sakshi

తనకల్లు : మహిళలపై టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత డిమాండ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో టీడీపీ నేత వేధింపులకు బలైన ఇంటర్‌ విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులను ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్దారెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరామర్శించారు. 

ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సంధ్యారాణి తల్లిదండ్రులు శ్రీనివాసులు, రాధమ్మలకు భరోసా ఇచ్చారు. సంధ్యారాణి బలవన్మరణానికి కారణమైన టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌కు ఆ పార్టీ నాయకులు అండగా నిలవాలని చూడడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, వేధింపులను ప్రజలు మరచిపోలేదన్నారు. 

టీడీపీ కీచకుల పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ నాయకులు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త కుమార్తెను ఆ పార్టీ నాయకుడే కాలయముడిగా మారి ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యాడని, అలాంటి దుర్మార్గుడిని రక్షించాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబును పోతుల సునీత ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top