
నెలరోజులకే చిరిగిపోతున్న వైనం
రాయదుర్గంటౌన్: ‘ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అద్భుతమైన క్వాలిటీ బ్యాగులు ఇవ్వాలని కుట్లు కూడా జాగ్రత్తగా, మంచిగా వేయాలని సూచించాను. నాణ్యత అధికంగా ఉండేలా చర్యలు చేపట్టాం.’ – ఇవీ స్కూల్ బ్యాగులు చూపిస్తూ మంత్రి నారా లోకేశ్ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. పిల్లలకు బ్యాగులు ఇచ్చి నెలరోజులు గడవకముందే చిరిగిపోయి విద్యా వ్యవస్థలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి.
మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇచ్చామని చెబుతున్నా..నెల కూడా మన్నిక రాకుండా చిరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మున్సిపల్ అభ్యుదయ హైస్కూల్‌లో ‘సాక్షి’ విజిట్‌లో నాణ్యత లోపించి చిరిగిపోయిన బ్యాగులతో వచ్చిన విద్యార్థులు కనిపించారు. అనేక మంది ఏడో తరగతి విద్యార్థులు చిరిగిన తమ బ్యాగులను చూపించారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు అందజేసిన బ్యాగుల నాణ్యత పరిస్థితి ఇలాగే ఉంది.