మహిళతో అసభ్య ప్రవర్తన; ఎస్‌ఐ సస్పెన్షన్‌

Ponduru Sub Inspector Suspension For Misbehaving With Custody Women - Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  నిందితురాలితో ఫోనులో అనుచితంగా మాట్లాడినట్టు ఆరోపణ ఎదుర్కొంటున్న పొందూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొల్లి రామకృష్ణను జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ అమిత్‌ బర్దార్‌ సోమవారం సస్పెండ్‌ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ ఈ విషయం ప్రకటించారు. పొందూరు మండలం రాపాక గ్రామంలో అక్రమ మద్యం నిల్వలు కలిగిన కేసులో నిందితురాలైన ఓ మహిళను ఎస్‌ఐ ఇంటికి రమ్మన్నట్టు ఫోన్‌లో రికార్డయిన సంభాషణ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్‌ఐను సస్పెండ్‌ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన తరువాత సీఆర్‌ నంబర్‌ 430/2020 యు/ఎస్‌ 354–ఎ ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో సిబ్బంది ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో ఎస్పీ హెచ్చరించారు. 

అసలేం జరిగిందంటే.. 
రాపాక కూడలికి సమీపంలోని కుమ్మరికాలనీలో నివాసం ఉంటున్న మహిళను శనివారం మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో అరెస్టు చేశారు. అదే రోజు తుంగపేటలో నిందితురాలి తండ్రిని మద్యం సీసాల నిల్వ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో ఆదివారం వీరిని స్టేషన్‌కు పిలిపించారు. అదే రోజున ఎస్‌ఐ ఫోనులో నిందితురాలితో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇంటికి వస్తే కేసు లేకుండా చూస్తానని ఫోనులో మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న వీధి చిరునామాను తెలియజేశారు. ఒంటరిగా మాత్రమే రావాలని సూచించారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోను సంభాషణ ఆడియో టేప్‌ వాట్సాప్‌లో హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన గురించి పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ స్పందించి సస్పెండ్‌ చేశారు. 

విచారణ ప్రారంభం.. కేసు నమోదు 
ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని జేఆర్‌పురం సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్సై రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. మహిళతో ఫోన్లో అనుచితంగా మాట్లాడారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top