‘నువ్వేంట్రా ఫిర్యాదు చేసేది’ బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు | Political Twist In Clash Between TDP and BJP Leader At Tirupati | Sakshi
Sakshi News home page

‘నువ్వేంట్రా ఫిర్యాదు చేసేది’ బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు

Jun 14 2025 9:19 AM | Updated on Jun 14 2025 9:51 AM

Political Twist In Clash Between TDP and BJP Leader At Tirupati

సాక్షి, చంద్రగిరి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించిన బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదారు. ఈ ఘటన శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని నాగయ్యగారిపల్లి స్వర్ణముఖి నది సమీపంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై బాధితుడి వివరాల ప్రకారం.. నాగయ్యగారిపల్లికి చెందిన బీజేపీ నేత నరేష్‌ కుమార్ ‌నాయుడు కొద్దిరోజులుగా అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నరేష్‌ కుమార్ ‌నాయుడు తన ఇంటి నుంచి చంద్రగిరి వస్తుండగా నాగయ్యగారిపల్లి వాగు వద్ద టీడీపీ నేత కొంగర సునీల్‌తో పాటు మరికొందరు  అటకాయించారు.

ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా ఇసుకపై ఫిర్యాదు చేస్తావా ? అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘మా ప్రభుత్వంలో నువ్వేంట్రా ఫిర్యాదు చేసేది’ అంటూ పచ్చమూకలు  కర్రలతో నరేష్‌పై దాడికి తెగబడ్డాయి. విచక్షణారహితంగా దాడిచేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నరేష్‌ను చంద్రగిరికి తరలించారు. బాధితుడు చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది పోలీసులను ఆశ్రయించారు. ఇసుకాసురులను ప్రశ్నించిన తనపై టీడీపీ నేత సునీల్‌తో పాటు మరికొంతమంది దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement