పోలవరం పరిహారం నేరుగా నిర్వాసితులకే

Polavaram compensation goes directly to Expatriates - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్న కేంద్ర జలశక్తి శాఖ

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వా­సితుల కుటుంబాలకు పరిహారం నేరుగా వారికే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. వైఎస్సా­ర్‌సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ ప్రశ్నకు జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గురువారం లోక్‌సభలో ఈ మేరకు సమా«దా­న­మిచ్చారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆఫీస్‌ మెమోరాండం 1.4.2014 నాటి ధర­లకే ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ మిగతా మొత్తం ఇవ్వాలని చెబుతోందన్నారు.

ఎప్పటికప్పు­డు ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2014 నుంచి డిసెంబర్‌ 2022 వరకు ఏపీ సర్కారు రూ.3,779.5 కోట్లు రీయింబర్స్‌ చేయాలని బిల్లులిచ్చిందని దీని నిమిత్తం రూ.3,431. 59 కోట్లు రీయింబర్స్‌ చేశామన్నా­రు. 2014 నుంచి 2022 వరకూ ఆర్‌అండ్‌ఆర్‌కు ఇచ్చి­న రూ.2,267.29 కోట్ల బిల్లుకు­గాను రూ.­2,110.23 కోట్లు రీయింబర్స్‌ చేశామన్నారు. 

పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ ప్రతిపాదనల్లేవు
పాత ప్రాజెక్టుల విస్తరణ, ఆధునీకరణ, పునరు­ద్ధ­రణల నిమిత్తం ఏపీ ప్రభుత్వం నుంచి ఎ­లాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ప్రశ్న­కు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

ఏపీకి ఐదు సోలార్‌ ప్రాజెక్టుల అనుమతి
4,100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఐదు సోలార్‌ పార్కులు ఏపీకి అనుమతించామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలి­పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వల్లభనేని బాల­శౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డిల ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
 
స్మార్ట్‌ సిటీ అడ్వైజరీ ఫోరంలో స్థానిక యువత 
స్మార్ట్‌ సిటీ మిషన్‌ నిబంధనల మేరకు స్మార్ట్‌ సిటీ అడ్వైజరీ ఫోరంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ మేయర్, సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ఇతర భాగస్వాములతోపాటు స్థానిక యువత ఉంటారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తిల ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 

కాగా, విశాఖ మెట్రో నిమిత్తం 42.55 కి.మీ పొడవున రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వం 2018లో ప్రతిపాదన ఇచ్చిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. ఈ మొత్తం కొరియాకు చెందిన ఎగ్జిమ్‌ బ్యాంకు పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ పద్ధతిలో ఆర్థిక సాయం చేస్తుందని అప్పుడు ఏపీ ప్రభుత్వం తెలిపిందని.. కానీ ఆ తర్వాత కొరియా బ్యాంకు సాయా­నికి నిరాకరించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీవీ సత్యవతి, ఎంవీవీ సత్యనారా యణల ప్రశ్నకు జవాబిచ్చారు. విశాఖ మెట్రోకు సంబంధించి అధ్యయనం నిమిత్తం కేంద్రం రూ.3.5 కోట్లు విడుదల చేసిందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top