ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ రిజర్వేషన్‌కు పిల్‌

PIL for NCC reservation in MBBS admissions Andhra Pradesh - Sakshi

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్‌ వైఎస్సార్‌ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్సార్‌ వైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్, ఎన్‌సీసీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో ఎన్‌సీసీ సర్టిఫికెట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసయ్య నర్సింహ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

నిబంధనల ప్రకారం ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కవిత గొట్టిపాటి వాదనలు వినిపిస్తూ.. ఎన్‌సీసీ కోటా విషయంలో అధికారులు ప్రభుత్వ జీవో ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత విద్యార్థులు వస్తే ఈ వ్యవహారంపై తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది.

ఇది సర్వీసు వివాదమని, ఇలాంటి వ్యవహారంలో పిల్‌ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అయినా కూడా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. కవిత జోక్యం చేసుకుంటూ.. ప్రవేశాలు జరుగుతున్నాయని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. నోటీసులు జారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top