ఓ పావురమా.. పందెం గెలువుమా

Pigeon Race Betting in Nellore and Prakasam districts - Sakshi

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పందేలు 

చెన్నైలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పావురాలతో నిర్వహణ 

రెండు కాళ్లకు అంకెతో పాటు నిర్వాహకుడి పేరుతో ట్యాగ్‌  

నెల్లూరులో ఎగిరిన పావురం చెన్నైలో ఎంచుకున్న గమ్యానికి చేరాలి 

పావురం.. స్వేచ్ఛకు ప్రతిరూపం. శాంతికి చిహ్నం. రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరే ఆ కపోతాలను చూసి మది పులకిస్తుంది. అనేకమంది ఏ గింజలో వేసి వాటిని తింటున్న ఆ పావురాలను చూస్తూ మైమరచిపోతారు. అటువంటి పావురాలకు కూడా పోటీలు పెడుతున్నారు కొందరు. ఆ పోటీల్లో పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు.  

సాక్షి, నెల్లూరు: కోడి, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే కార్‌ రేసింగ్, బైక్‌ రేసింగ్‌లూ అందరికీ తెలిసినవే. కానీ పావురాలతో కూడా పెద్ద ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లోనే కాదు.. మన దేశంలోను ఇవి జరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రంగా ఏర్పడిన అనేక క్లబ్‌లు, సొసైటీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడు కేంద్రంగా వెలిసిన క్లబ్‌ల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. చెన్నై ప్రాంతానికి చేరువగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రేసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో భారీ ఎత్తున బెట్టింగ్‌లు చేస్తున్నారు.

ఇలాంటి పందాలు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 250 వరకు గుర్తింపు పొందిన క్లబ్‌లు ఉన్నాయి. ఒక్క చెన్నైలోనే 60 నుంచి 70 రిజిస్టర్డ్‌ సొసైటీలున్నాయి. చెన్నైలో అధికారికంగా రిజిస్టర్‌ చేసుకుని, పోలీస్, అటవీశాఖల అనుమతి తీసుకున్న తర్వాతే పోటీలు నిర్వహిస్తారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో చైనా భాషతో కూడిన స్క్రాచ్‌ కార్డ్స్‌తో దొరికినవి ఇలాంటి పోటీల్లో పాల్గొన్న పావురాలే. ఇటీవల పందేల కోసం తీసుకొచ్చిన పావురాలను పోలీసులు పట్టుకోవడంతో పావురాల రేసింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి పావురాల రేసింగ్‌కు సిద్ధపడుతుండగా పోలీసులు ఏడుగురిని అరెస్టుచేసి 500 పావురాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో బెట్టింగ్‌ విషయం బయటపడింది. 

ఇటీవల ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద పోలీసులు దాదాపు వెయ్యి పావురాలను స్వాధీనం చేసుకుని పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కర్నూలు జిల్లాలో పీజియన్‌ రేసింగ్‌ క్లబ్‌లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి.  

ప్రత్యేక శిక్షణతో శీతాకాలంలోనే పందాలు 
పందెం రాయుళ్లు ముందుగా చెన్నై నిర్వాహకులతో కలిసి పావురాల రేసింగ్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ముందుగా వచ్చిన పావురంపై బెట్టింగ్‌ కాసిన దానికి రెండింతల సొమ్ము వస్తుంది. ముందుగా కోడింగ్‌ ఉన్న ట్యాగ్‌లను ప్రత్యేక ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అలా ఆన్‌లైన్‌లో చూసిన బెట్టింగ్‌ రాయుళ్లు తనకు నచ్చిన పావురంపై పందెం కాస్తారు. బెట్టింగ్‌ల  నిర్వహణకు ప్రత్యేక టీం ఉంటుంది. ఒక్కో పందెంలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయంటే ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాతావరణ అనుకూలత దృష్ట్యా ఏటా శీతాకాలంలో మాత్రమే ఈ పందేలు జరుగుతాయి. ఈ క్లబ్‌ల సభ్యులు పెద్దసంఖ్యలో పావురాలను పెంచుకుంటున్నారు.  

ఒక్కో యజమాని గరిష్టంగా 32 పావురాలను పందెంలోకి దింపవచ్చు. పావురం పుట్టిన ఏడెనిమిది రోజుల్లోనే వాటి కాలికి క్లబ్‌కు చెందిన రింగు తొడుగుతారు. ఇంటికి దూరంగా మరెక్కడో పందెంలో దించేప్పుడు ఈ రింగులపై స్క్రాచ్‌ కార్డ్‌తో కూడిన ట్యాగ్‌ అతికిస్తారు. ప్రస్తుతం ఇవి చైనాలో తయారై భారత్‌కు వస్తున్నాయి. పావురాన్ని వదిలిన ప్రాంతం నుంచి యజమాని ఇంటికి చేరిన వెంటనే  ట్యాగ్‌ను స్క్రాచ్‌ చేసి, అక్కడున్న సంఖ్యను ప్రత్యేక యాప్‌ ద్వారా ఫొటో తీసి తమ క్లబ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో  పోస్టు చేస్తుంటారు. దీన్లోని సమాచారం ఆధారంగా  గెలిచిన పావురాన్ని ప్రకటిస్తారు. ఈ వివరాలు ప్రపంచంలోని అన్ని క్లబ్‌లకూ చేరవేస్తారు.   

ఇప్పటికీ బ్రిటీష్‌ బ్లడ్‌లైనే.. 
కపోతాల్లో బ్లడ్‌లైన్‌ (వంశం) ఉంటుంది. బ్రిటిష్‌ వాళ్లు తీసుకొచ్చిన నెదర్లాండ్స్, బెల్జియం, యూరప్‌లకు చెందిన పావురాల బ్లడ్‌ లైనే (ఉమర్స్‌) ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలోని చాలా క్లబ్‌లు ఉమర్స్‌ జాతి పావురాలనే ఎక్కువగా పందేలకు ఉపయోగిస్తున్నాయి. ఈ పావురాల శక్తి సామర్థ్యాలను వాటి కళ్లు, రెక్కలను బట్టి నిర్థారిస్తారు. వీటిని పరిశీలించి అది ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేవి అంచనా వేస్తారు. రేసుల్లో పాల్గొనే గుర్రాలకు చరిత్ర ఉన్నట్లే ఈ పావురాలకు ప్రొఫైల్‌ ఉంటుంది.  వీటికి కాళ్లకు వేసే రింగుకు ఉండే ఐదంకెల నంబరు ఆధారంగా పెడిగ్రీగా పిలిచే ఈ చరిత్రను రికార్డుల్లోకి ఎక్కిస్తారు. 

పందెం పావురాలను స్వాధీనం చేసుకున్నాం 
నాయుడుపేట పరిధిలో పావురాల బెట్టింగ్‌ జరుగుతోందని సమాచారం రావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ఒక వాహనంలో ఉన్న పక్షులకు అనుమతి ఉన్న పత్రాలు చూపించారు. మరో వాహనంలో ఉన్న వాటికి మాత్రం ఫేక్‌ అనుమతి చూపించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని పక్షుల సంరక్షణ కేంద్రానికి చేర్చాం. ఏడుగురు ని«ందితులను అరెస్ట్‌ చేశాం. బెట్టింగ్‌లు జరుగుతున్నాయని విచారణలో తేలింది.  
– వై.సోమయ్య,సీఐ, నాయుడుపేట   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top