కొత్తగా 60 బోట్లకు అనుమతులు

Permits For 60 New Boats In AP - Sakshi

విజయవాడతో పాటు విశాఖలోనూ సీ ప్లేన్‌ సౌకర్యం

పర్యాటక కార్యకలాపాల పునరుద్ధరణకు తక్షణ చర్యలు

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా కడప వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌

పర్యాటక శాఖ సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 60 పర్యాటక బోట్లకు అనుమతులు మంజూరు చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. నదీ ప్రాంతాలు, రిజర్వాయర్లలో బోటింగ్‌ కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. 174 ప్రైవేట్‌ బోట్లు నడిపేందుకు దరఖాస్తులు రాగా.. ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. కరోనా కారణంగా మూతపడిన పర్యాటక కార్యకలాపాలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా దిండి, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పర్యాటక బోట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు.

రాష్ట్రంలో 9 చోట్ల కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బోట్ల స్థితిగతులు, లైసెన్సులు వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాపికొండలు ప్రాంతంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నావిగేషన్‌ సర్వే చేయాల్సి ఉన్నందున అక్కడ మినహా అన్నిచోట్లా త్వరితగతిన బోటింగ్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సాగర సంగమం, అంతర్వేది, హంసలదీవిలో పర్యాటక బోట్లు నడపనున్నట్టు తెలిపారు. కొల్లూరు, ఐలేరుల్లో కొత్తగా పర్యాటక పడవలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) విధానంలో కొత్తగా పడవల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అంతర్వేది నుంచి నరసాపురం, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, నాగార్జున సాగర్, కడప జిల్లా బ్రహ్మంసాగర్, కర్నూలు జిల్లా అవుకు, మంత్రాలయం ప్రాంతాల్లో పీపీపీ విధానంలో కొత్తగా పడవలు కొనుగోలు చేసి నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.

విజయవాడ, విశాఖలో సీ ప్లేన్‌ సౌకర్యం
విజయవాడతోపాటు విశాఖకు కూడా సీ ప్లేన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.   రాష్ట్రంలో ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి, రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల  నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఖేల్‌ ఇండియా కింద కడప జిల్లాలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఎంపికైందని, దీనివల్ల ఏడాదికి రూ.3 కోట్లు ఆ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. త్వరలో ఏపీ యూత్‌ సర్వీసెస్‌ పేరిట యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభిస్తామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top