సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోండి | Sakshi
Sakshi News home page

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోండి

Published Tue, Feb 9 2021 4:18 AM

Peddireddy Ramachandra Reddy Appeals Before The High Court - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మీడియా, ప్రెస్‌తో మాట్లాడవద్దంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ గురించి పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. అత్యవసర విచారణకు అభ్యర్ధించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. అంతకుముందు.. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితంచేస్తూ నిర్బంధ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు ఆయనను మీడియా, ప్రెస్‌తో మాట్లాడకుండా నియంత్రిస్తూ ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేస్తూ ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారు. మీడియా, ప్రెస్‌తో మాట్లాడవద్దన్న ఉత్తర్వులను మాత్రం సమర్థిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చిన సంగతీ తెలిసిందే. వీటిని సవాలు చేస్తూ పెద్దిరెడ్డి తాజాగా అప్పీల్‌ దాఖలు చేశారు. 

చట్ట నిబంధనలను పాటించాలనడం తప్పా? 
‘మీడియా, ప్రెస్‌తో మాట్లాడవద్దన్న ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సమర్థించడం ద్వారా రాజ్యాంగం నాకు ప్రసాదించిన భావ ప్రకటన హక్కును అడ్డుకున్నట్లయింది. ఎన్నికల కమిషనర్‌ విధించిన ఆంక్షలు ఏ మాత్రం సహేతుకమైనవి కావు. చట్ట నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాత్రమే నేను చెప్పాను. పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ప్రకారం ఒకే నామినేషన్‌ దాఖలైన చోట, ఆ అభ్యర్థి గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి తక్షణమే ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే, నిమ్మగడ్డ రమేశ్, ఏకగ్రీవాల ఫలితాలను ప్రకటించవద్దని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను ఆదేశించారు. ఇది పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేకాక.. ఎన్నో ఏళ్ల నుంచి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వ విధానాలకు కూడా విరుద్ధం. నేను ఈ నిబంధనను తూచా తప్పకుండా పాటించాలని మాత్రమే అధికారులను కోరాను. చట్ట విరుద్ధమైన ప్రకటనలు చేసిన ఎన్నికల కమిషనర్‌ తీరును తప్పుపట్టాను. ఎన్నికల కమిషనర్‌ అధికారులను బెదిరిస్తూ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. చట్టం, నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు, వాటిని కాలరాస్తూ నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఏకగ్రీవాల ఫలితాలను నిలిపేయాలని కోరడం ద్వారా ఎన్నికల కమిషనర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీన్నే నేను ప్రశ్నించాను. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. నేను చేసిన ప్రకటన ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమేనని సింగిల్‌ జడ్జి అనడం ఎంతమాత్రం సరికాదు’.. అని పెద్దిరెడ్డి తెలిపారు.

నోటీసులివ్వకుండా.. వివరణ కోరకుండానే.. 
‘నన్ను మీడియా, ప్రెస్‌తో మాట్లాడవద్దంటూ ఉత్తర్వులు జారీచేసే ముందు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ నాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. వివరణ కూడా అడగలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పంచాయతీరాజ్‌ శాఖా మంత్రిగా అన్యాయాలను ప్రశ్నించే హక్కు నాకు ఉంది. దీన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. నిమ్మగడ్డ రమేష్‌ ఉత్తర్వుల్లోని ఏకపక్ష, కక్షపూరిత ఉద్దేశాలను సింగిల్‌ జడ్జి చూడలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్ పై ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాను. అందుకు కౌంటర్‌గానే నిమ్మగడ్డ రమేష్‌ నన్ను మీడియా, ప్రెస్‌తో మాట్లాడకుండా, ఇంటి నుంచి కదలకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులిచ్చారు’.. అని పెద్దిరెడ్డి తన అప్పీల్‌లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement