
సాక్షి, అమరావతి: మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేకదృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల పరిశీలకులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడి దొంగ ఓట్లను చేర్పించారని గుర్తుచేశారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని ఎత్తిచూపారు. ఆ దొంగ ఓట్లను గుర్తించి, వాటి తొలగింపునకు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించాలని సూచించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులు మరింత కీలకంగా, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసిన మేరకు 175 నియోజకవర్గాలకు 175 గెల్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గాలపై అవగాహన పెంచుకోవాలని, స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం, అక్కడి ప్రతిపక్షాల పాత్ర వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.
వారంలో కనీసం రెండురోజులు నియోజకవర్గాల్లో ఉండి పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా పార్టీ సమన్వయకర్తకు తలలో నాలుకలాగా మెలుగుతూ కీలకంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే సమన్వయంతో పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు. స్థానిక నేతల అభిప్రాయాలు విభిన్నంగా ఉంటే వాటిని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ల దృష్టికి, పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
జగనన్న సురక్ష పథకం నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతోంది.. ప్రజలకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారం, పథకాలను లబ్దిదారులకు అందించేలా సమన్వయం చేయడం వంటి వాటిపైన కూడా దృష్టిపెట్టాలని కోరారు. గృహసారథులు, గ్రామ, వార్డు సచివాలయాల కన్వి నర్లు.. మండల, డివిజన్ పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారని.. రానున్న ఎన్నికలలో పార్టీ విజయం త«థ్యమని చెప్పారు. అయినప్పటికి నియోజకవర్గాలలో పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.