ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి..

Ongole Young Man Who Died With Fits in USA - Sakshi

ఒంగోలు: ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు ఫిట్స్‌తో అక్కడ అకస్మాత్తుగా మృతిచెందాడు. కొడుకులిద్దరు, భర్తను ఒకరి తర్వాత ఒకర్ని కోల్పోయిన ఆ ఇల్లాలి వేదన చూపరులను కంట తడిపెట్టిస్తోంది. వివరాలివీ.. నగరంలోని కొప్పోలుకు చెందిన దొండపాటి కార్తీక్‌ (26) బీటెక్‌ వరకు ఒంగోలులోనే చదివాడు. రెండు నెలల క్రితం ఎంఎస్‌ డేటాసైన్స్‌ చదువు కోసం అమెరికాలోని చికాగో స్టేట్‌ లెవిస్‌ యూనివర్శిటీకి వెళ్లాడు. ఇప్పటికే చిన్న కుమారుడు, భర్త మృతిచెందడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కార్తీక్‌ మీదే ఆశలు పెట్టుకున్న తల్లి శోభారాణి అంతదూరం వద్దంటున్నా కార్తీక్‌ వినిపించుకోలేదు. చదువు పూర్తికాగానే రెండేళ్లలో వచ్చేస్తానంటూ వెళ్లాడు. కానీ, భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉ.7 గంటల సమయంలో కార్తీక్‌ మూర్ఛవ్యాధి (ఫిట్స్‌)కి బలయ్యాడు. వెళ్లిన రెండు నెలల్లోనే కొడుకు కన్నుమూయడంతో ఆ తల్లి ఆవేదన వర్ణణాతీతంగా మారింది. 

15ఏళ్ల క్రితం ఇదే రోజు చిన్నకొడుకు మృతి
15 సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు శ్రీరామనవమి పండుగ రోజే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ దంపతులు తమ ఆశలన్నీ కార్తీక్‌పైనే పెట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం శోభారాణి భర్త రత్తయ్య కూడా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో.. మిగిలిన ఒక్క కొడుకూఅమెరికా వెళ్లి మృతిచెందడంతో ఆ తల్లి హృదయం విలవిల్లాడుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. మరోవైపు.. కార్తీక్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. చికాగో అధికారులతో వారు చర్చిస్తున్నారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top