
వ్యవసాయ శాఖలో కొనసాగుతున్న బది‘లీలలు’
డిప్యూటీ సీఎం సిఫార్సుతో కాకినాడ డీఏవోకు రీపోస్టింగ్
మరో ముగ్గురికి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పోస్టింగ్
24 మంది ఏడీలకు కోరుకున్న చోట నియామకాలు
నగదు.. పైరవీలతో అడ్డగోలుగా నియామకాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ శాఖలో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. గడువు ముగిసిన రెండు నెలల తర్వాత రీపోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నలుగురు జాయింట్ డైరెక్టర్లకు గతంలో పనిచేసిన చోటే పోస్టింగ్ ఇవ్వగా.. 24 మంది ఏడీలకు కోరుకున్న చోట పోస్టింగ్‌లు కట్టబెడుతూ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివెనుక నగదు చేతులు మారడంతోపాటు పైరవీలు సైతం ప్రధాన భూమిక పోషించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖమంత్రితో పాటు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పెద్దపీట వేయగా, వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో చక్రం తిప్పుతున్న పలువురు యూనియన్ నేతలు సైతం పైరవీలు సాగించారు.
సిఫార్సుల పేరిట కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు దండుకున్నట్టు చెబుతున్నారు. దీంతో బదిలీల ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా సాగింది. ఒక దశలో 27 మంది జిల్లా వ్యవసాయ శాఖాధికారుల (డీఏవో)తో పాటు 133 మంది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(ఏడీఏ) బదిలీల ఉత్తర్వులను నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వారిలో 110 మంది ఏడీఏలకు, 24 మంది డీఏవోలకు, ఇద్దరు జాయింట్ డైరెక్టర్లకు గత నెల 26న రీపోస్టింగ్‌లు ఇచ్చారు.
విజయనగరం జిల్లా డీఏవోకు బదిలీ చేసిన కాకినాడ జిల్లా డీఏవో (జేడీఏ) ఎన్.విజయకుమార్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సిఫార్సుతో తిరిగి కాకినాడ జిల్లా డీఏవోగా రీపోస్టింగ్ ఇచ్చారు. టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రకాశం జిల్లా డీఏవోగా బదిలీ చేసిన పల్నాడు డీఏవో ఐ.మురళిని నెల్లూరు ఆత్మా పీడీగా బదిలీ చేయగా, కాకినాడ జిల్లా డీఏవోగా బదిలీ చేసిన విజయనగరం జిల్లా డీఏవో వీటీ రామారావుకు తిరిగి అదే స్థానంలో రీపోస్టింగ్ ఇచ్చారు.
పార్వతీపురం మన్యం డీడీఏగా బదిలీ చేసిన ఏఎస్‌ఆర్ జిల్లా డీడీఏ ఎస్‌బీఎస్ నంద్‌ను తిరిగి అదే జిల్లాకు బదిలీ చేశారు. ఏఏస్‌ఆర్ డీడీఏగా బదిలీ చేసిన పార్వతీపురం మన్యం జిల్లా డీడీఏ కె.రోబర్ట్‌పాల్‌కు తిరిగి పార్వతీపురం మన్యం జిల్లా డీడీఏగా రీపోస్టింగ్ ఇచ్చారు. గతంలో పోస్టింగ్‌లు ఇచ్చి నిలిపివేసిన, పోస్టింగ్‌లు ఇచి్చన వారిలో 24 మంది ఏడీఏలకు కోరుకున్నచోట పోస్టింగ్‌లు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు.