ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్‌ కాల్‌

One Phone Call That Saved Three Lives - Sakshi

అనంతపురం సిటీ: కుటుంబాన్ని వద్దనుకుని ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త...  పిల్లల సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు. వివరాలు.. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రామానాయుడు భార్యాబిడ్డలతో కలసి నగరంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల వయస్సు కలిగిన కొడుకును చూసుకుంటూ రామానాయుడు రోజులు నెట్టుకొచ్చాడు. భార్య కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపం చెందిన అతను తన ఇద్దరు బిడ్డలతో కలసి నాయక్‌నగర్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. వారిని గమనించిన స్థానికులు డయల్‌ 100కు సమాచారం అందించడంతో నాల్గో పట్టణ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ తక్షణమే స్పందించి బ్లూకోట్‌ సిబ్బందిని రైల్వే ట్రాక్‌ వద్దకు పంపారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురిని కాపాడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్‌ అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా బ్లూకోట్‌ సిబ్బందిని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ జాకీర్, రైల్వే సీఐ నాగరాజు అభినందించారు.   

(చదవండి: అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top