రూ.లక్ష కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ | Sakshi
Sakshi News home page

రూ.లక్ష కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

Published Mon, Jun 12 2023 3:02 AM

NTPC started phase 1 works at Poodimadaka - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ పనులను ఎన్‌టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్‌టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది.  

1,200 ఎకరాల్లో ఏర్పాటు... 
రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థ అయిన ఎన్‌టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్‌ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్‌టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లో గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్‌మెంట్‌ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్‌ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్‌టీపీసీకి కే­­­టా­యించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొ­దలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందు­కు ఎన్‌టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

9,000 ఎండబ్ల్యూహెచ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు 
ఇప్పటికే ఏపీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టు ఫేజ్‌–1 పనులు ప్రారంభించిన ఎన్‌టీపీసీ... 9,000 మెగావాట్‌హవర్‌ (ఎండబ్ల్యూహెచ్‌) స్టోరేజ్‌ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్‌టీపీసీ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) శ్రీనివాసన్‌ తెలిపారు.

ప్రీ ఇంజినీరింగ్‌ బిల్డింగ్స్, షెడ్‌లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్‌ రూఫ్‌టాప్‌లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్‌ సెల్స్, బ్యాటరీలు, సోలార్‌ వేపర్స్, సోలార్‌ మాడ్యూల్స్, విండ్‌ టర్బైన్‌ ఎక్విప్‌మెంట్, కార్బన్‌ క్యాప్చర్‌ సిస్టమ్స్‌ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో తయారు కానున్నాయి.

దక్షిణాసియా దేశాల మార్కెట్‌ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్‌ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్‌ ఇథనాల్‌ సహా గ్రీన్‌ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్‌ల సోలార్, 20 గిగావాట్‌ల రెన్యువబుల్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్‌టీపీసీ ప్రకటించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement