
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌టీపీసీ(NTPC) విదేశాల్లో యురేనియం గనులను గుర్తించడానికి కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని యోచిస్తోంది. దీని ద్వారా తన భవిష్యత్ అణు ప్రాజెక్టుల కోసం యురేనియం వనరులను స్థిరీకరించుకోవడానికి ముందుకు సాగుతోంది. ఈమేరకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
ఈ ఒప్పందంలో భాగంలో నియమించుకునే కన్సల్టెంట్ సంభావ్య ప్రదేశాలపై సలహా ఇస్తారు. యురేనియం నిల్వల(uranium mines)పై మార్గనిర్దేశం చేయడానికి రిజర్వ్ పరిమాణాలు, లాజిస్టిక్స్ ఖర్చులు వంటి అంశాలను అంచనా వేస్తారు. ప్రస్తుతం ఎన్‌టీపీసీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)తో జాయింట్ వెంచర్ ద్వారా రాజస్థాన్‌లో రూ.42,000 కోట్ల అణు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎన్‌టీపీసీకి 49% వాటా, ఎన్‌పీసీఐఎల్ 51% వాటా కలిగి ఉంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 4x700 మెగావాట్ల మహి బన్స్‌వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీన్ని అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (అశ్విని)తో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ వివిధ అణు సాంకేతిక ప్రొవైడర్లు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అదనపు అణు ప్రాజెక్టులను స్వతంత్రంగా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో కంపెనీ తన ఉనికిని విస్తరించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!