రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం..
నాడూ నేడూ అదే డ్రామా!
టీడీపీ హయాంలో 2014–19 మధ్య రూ.19.6 లక్షల కోట్ల విలువైన 1,761 ఒప్పందాలు
మూడు సదస్సుల్లో అమల్లోకి వచ్చింది కేవలం 13%మాత్రమే
17 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో రూ.1.7 లక్షల కోట్ల విలువైన 91 ప్రాజెక్టులకు ఆమోదం
అందులో వాస్తవ రూపం దాల్చింది కేవలం 5.69 శాతం మాత్రమే
హైపర్‌లూప్, నెక్ట్స్ ఆర్బిట్, బీఆర్ షెట్టి, గుడియాన్ టెక్నాలజీ,టైటాన్ ఏవియేషన్, సోలార్‌గైజ్ ఇండియా కంపెనీల పేర్లైనా కనీసం గుర్తున్నాయా బాబూ?
వైఎస్సార్ సీపీ హయాంలోనే వచ్చిన ఎన్టీపీసీ, రెన్యూ పవర్, సెంచురీయన్, ఏటీసీ టైర్స్, రిలయన్స్ ప్రాజెక్టులతో తాజాగా బాబు సర్కారు తిరిగి ఒప్పందాలు
అందుకోసం ఆర్నెల్లుగా పెట్టుబడుల పేరుతో సీఎం, పలువురు మంత్రుల విదేశీ పర్యటనలు
వైఎస్ జగన్ హయాంలో విశాఖ వేదికగా 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు
వాస్తవ రూపం దాల్చిన 91 శాతానికిపైగా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: రెడీ.. యాక్షన్.. కెమెరా..! అంటూ విశాఖలో ప్రివ్యూ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తరహాలో.. క్రెడిట్ చోరీతో ప్రజలకు మరోమారు పెట్టుబడుల సినిమా చూపించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది! శుక్ర, శనివారాల్లో విశాఖ వేదికగా సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా చూపించనున్నారు. 2014– 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే తరహా సినిమాలను రాష్ట్ర ప్రజలకు చూపించారు. 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్లు సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్స్ పేరిట విశాఖలో సమావేశాలు నిర్వహించి భారీగా ప్రచారం చేసుకున్నారు.
ఆ మూడు సమావేశాల్లో 1,761 ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.19.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా 34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాల సంగతి దేవుడెరుగు.. ఆఖరికి పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో వాస్తవంగా అమల్లోకి వచ్చింది 45 మాత్రమే. అంటే 13 శాతమే కార్యరూపం దాల్చా యి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే వచ్చిన పలు కంపెనీలతో తాజాగా విశాఖ వేదికగా మళ్లీమళ్లీ ఒప్పందాలు చేసుకుంటూ అందుకోసం ఆర్నెల్లుగా సీఎం, పలువురు మంత్రులు విదేశీ పర్యటనలు చేసి రావడం గమనార్హం. 
ఎస్‌ఐబీపీలకూ దిక్కులేదు..
పార్టనర్‌షిప్ సమ్మిట్ ఒప్పందాలే కాదు.. ముఖ్యమంత్రి అధ్యక్షత వహించే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం పొందిన ప్రాజెక్టులకు సైతం 2014–19 మధ్య టీడీపీ హయాంలో దిక్కు లేకుండా పోయింది. ఎక్కడైనా ఎస్‌ఐపీబీ ఆమోదం లభించిందంటే ప్రాజెక్టులు పరుగులు పెట్టాల్సిందే. 2014–19 మధ్య చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 17 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు జరిగాయి.
అందులో మొత్తం రూ.1,70,036 కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 2,04,183 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. అయితే నాడు టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి ఎస్‌ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన వాటిలో 5.69 శాతం మాత్రమే అమల్లోకి వచ్చాయి. రూ.9,681 కోట్ల విలువైన ఒప్పందాలు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా ఉపాధి లభించింది 36,140 మందికి మాత్రమే. 
2014 –19 కితకితలే కితకితలు..!
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైపర్ లూప్ దగ్గర నుంచి సుఖోయ్ యుద్ధవిమానాల వరకు రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అసలు ప్రపంచంలోనే అమల్లోకి రాని హైపర్‌లూప్ కాన్సెప్ట్‌తో అమరావతి నుంచి విశాఖ నిమిషాల్లో చేరుకోవచ్చంటూ ఆయన చేసిన ప్రచారం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్‌క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిపి రూ.14,000 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేశారు.
సెమీ కండక్టర్స్ విభాగంలో ఎటువంటి అనుభవం లేని నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని ప్రచారం చేశారు. ఆ కంపెనీ ద్వారా 1,10,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే హల్దియా రూ.62,714 కోట్లతో కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ నెలకొల్పుతోందంటూ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావుడిగా 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. 

గత ప్రభుత్వం 2023లో కుదుర్చుకున్న ఒప్పందాలలో 91 శాతం వాస్తవరూపం దాల్చినట్టుగా పరిశ్రమల శాఖ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం
గుడియాన్ టెక్నాలజీస్ రూ.40,000 కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్, రూ.23,285 కోట్లతో సోలార్‌గైజ్ ఇండియా, రూ.22,500 కోట్లతో టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోందంటూ టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవికాకుండా హెచ్‌పీసీఎల్ గెయిల్ క్రాకర్ కాంప్లెక్స్ (రూ.40,000 కోట్లు), అనంత్ టెక్నాలజీస్ (రూ.4,500 కోట్లు), సిరీన్ డ్రగ్స్ (రూ.8,200 కోట్లు), రాయల విండ్ పవర్ (రూ.16,500 కోట్లు) తదితర సంస్థలు టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్న తర్వాత మొహం చాటేశాయి.
2018లో ఒప్పందం చేసుకున్న వాటిలో ఎస్‌బీ ఎనర్జీ (రూ.13,200 కోట్లు), మైత్ర మొబైల్ (రూ.7,000 కోట్లు), కోనసీమ ఫెర్టిలైజర్స్ (రూ.5,000 కోట్లు), బద్వే ఇంజనీరింగ్ (రూ.4,200 కోట్లు) లాంటి సంస్థలు అనంతరం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఏరోస్పేస్ వెంచర్స్ రూ.9,600 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోగా భూమి కేటాయించినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు.
ఎన్టీపీసీ ఒప్పందం అప్పటిదే.. పాతవాటికి కొత్తవిగా కలరింగ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను తమ ఖాతాల్లో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా విస్తరణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2023 మార్చి4న నాటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో విశాఖ జీఐఎస్ సదస్సులో ఎన్టీపీసీతో ఒప్పందం కుదిరిన రూ.1.85 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ (అనకాపల్లి వద్ద)ను ఇప్పుడు చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నారు.
అలాగే రూ.69,000 కోట్లతో ఇండోసోల్ ప్రాజెక్టు, తిరుపతిలో రూ.7,500 కోట్లతో జిందాల్ స్టీల్, రూ.3,700 కోట్లతో రెన్యూ ఎనర్జీ, రూ.4,500 కోట్లతో సత్యసాయి జిల్లాలో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ లాంటి కంపెనీలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు చేసుకోగా, ఇప్పుడు బాబు సర్కారు వాటిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే వచ్చిన ఎన్టీపీసీ, రెన్యూ పవర్, సెంచురీయన్, ఏటీసీ టైర్స్, రిలయన్స్ ప్రాజెక్టులతో తాజాగా విశాఖ సదస్సులో తిరిగి కొత్త ఒప్పందాలకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది.
జగన్ హయాంలో 91 శాతానికి పైనే..
వైఎస్సార్‌సీపీ హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పరిశ్రమల శాఖ నుంచి 99 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ.6,60,068.72 కోట్ల విలువైన పెట్టుబడులతోపాటు 7,56,455 మందికి ఉపాధి లభించనుంది. ఆ ఒప్పందాలు జరిగిన రెండేళ్లలోపే 90కిపైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించగా.. అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించాయి. మొత్తం పెట్టుబడుల్లో 91.06 శాతం అంటే రూ.6,01,071.72 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు తాజాగా చంద్రబాబు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా తెలియచేసింది.
ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో ఏజీపీ సిటీ గ్యాస్ (రూ.10,000 కోట్లు) ఐవోసీ (రూ,4,300), ఇండోసోల్ (రూ.69,000 కోట్లు), జిందాల్ స్టీల్ ఆంధ్రా (రూ.7,500 కోట్లు), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (రూ.16,350), ఎన్టీపీసీ (రూ.1,85,000 కోట్లు), ఆ్రల్టాటెక్ సిమెంట్ (రూ.4,000 కోట్లు), ఉత్కర్ష (రూ.4,500 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.5,500 కోట్లు), అలయన్స్ టైర్స్ విస్తరణ (రూ.1,100 కోట్లు), బ్లూస్టార్ (రూ.550 కోట్లు), కలర్‌షైన్ ఇండియా (రూ.510 కోట్లు), దాల్మియా సిమెంట్స్ (రూ.650 కోట్లు), దివీస్ ల్యాబ్ (రూ.790 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ (రూ.1,113 కోట్లు), ఇగులా స్టెర్‌లెస్ (రూ.600 కోట్లు), గ్రీన్‌లామ్‌సౌత్ (రూ.825 కోట్లు), జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ (రూ.550 కోట్లు), కింబెర్లీ క్లార్క్ ఇండియా (రూ.700 కోట్లు), లైఫస్ ఫార్మా (రూ.2,319 కోట్లు), లారస్ (రూ.1200 కోట్లు), ఎల్జీ పాలిమర్స్ (రూ.240 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.2,500 కోట్లు), టీసీఎల్ (రూ.500 కోట్లు) లాంటి పలు ప్రధాన కంపెనీలున్నాయి.


