ఏఆర్‌ఈటీ రద్దు తర్వాతే కొత్త బార్లకు నోటిఫికేషన్
సిండికేట్‌కు ఏటా రూ.500 కోట్ల లబ్ధి
బిడ్లు దాఖలు చేయకుండా పక్కా డ్రామా
చంద్రబాబు గత హయాంలోనూ ఇదే దందా
అప్పట్లో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ పంతం నెగ్గించుకుంది. బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్‌ఈటీ) రద్దు చేసిన తర్వాతే కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని శాసించింది. సిండికేట్ చెప్పినట్లే చంద్రబాబు ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఆర్‌ఈటీ రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో మిగిలి ఉన్న 301 బార్లకు లైసెన్సులు ఇచ్చేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రీడ్ విధానాల్లో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది.
జిల్లా కలెక్టర్లు ఫిబ్రవరి 8న లాటరీ విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయిస్తారు. ఏఆర్‌ఈటీ రద్దు కోసం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో టీడీపీ సిండికేట్ పక్కాగా కథ నడిపింది. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం గత ఏడాది ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ టీడీపీ సిండికేట్ అన్ని బార్ల లైసెన్సుల కోసం ఉద్దేశ పూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయలేదు. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంది. రెండు మూడు సార్లు నోటిఫికేషన్లు జారీ చేసినా సరే.. 840 బార్లలో కేవలం 499 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటిని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది.
మరో 301 బార్లను పెండింగులో ఉండేట్టు చేసింది. ఏఆర్‌ఈటీ రద్దు చేస్తే తప్ప.. ఆ బార్ల లైసెన్సులకు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించేందుకే ఈ డ్రామాను రక్తి కట్టించింది. అంతా స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ డ్రామాలో అసలు ఘట్టానికి ఈ నెల మొదటి వారంలో తెర తీశారు. బార్లపై 15 శాతం ఏఆర్‌ఈటీని రద్దు చేస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. ఆ వెంటనే ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తమ పంతం నెగ్గడంతో పెండింగులో ఉన్న 301 బార్ల లైసెన్సుల ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది. ఆ బార్ల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది.
రూ.2 వేల కోట్ల దోపిడీకి పచ్చజెండా
మద్యం సిండికేట్‌కు ప్రభుత్వం తలొగ్గడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. ఎల్లో సిండికేట్ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కారు మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతమున్న 15 శాతం ఏఆర్‌ఈటీని ఈ నెల మొదటి వారంలో రద్దు చేసింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.340 కోట్లు గండి పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది.
కానీ వాస్తవానికి రూ.500 కోట్ల వరకు గండి పడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల మేర ప్రభుత్వం నష్టపోనుంది. అంటే.. టీడీపీ సిండికేట్ గల్లా పెట్టె మరో రూ.2 వేల కోట్లతో కళకళలాడనుంది.
అప్పట్లోనూ ప్రివిలేజ్ ఫీజు రద్దు దందా
2014–19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దుచేసి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ము కాసింది. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే 2015లో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 216, 217 పేరుతో రెండు చీకటి జీఓలు జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. దీనిపై బాబు మీద కూడా కేసు నమోదైంది.


