తప్పుడు కథనంపై ‘ఈనాడు’కు నోటీసులు

Notice to Eenadu News On Dasapalla lands - Sakshi

దసపల్లా భూముల కథనంపై ఆ భూముల యజమాని రాణి కమలాదేవి ఆగ్రహం

ఈనాడుకు నోటీసులు జారీ చేసిన ఆమె తరపు న్యాయవాది

హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ భూములు కమలాదేవివని తీర్పిచ్చాయని వెల్లడి

అయినా అసత్యాలతో కథనం ప్రచురించారని ఆగ్రహం

ఖండన ప్రచురించకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజ­లను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు దిన­పత్రికకు ఆ భూముల యజమాని రాణి కమలా­దేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్‌ చంద్ర బుధ­వారం పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. రాణి కమలాదేవి తరపు న్యాయవాది అరుణ్‌దేవ్‌ ఈనాడు ఎడిటోరియల్‌ డైరెక్టర్, ఎడిటర్, ఈనాడు దినప­త్రికకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల సారాంశం ఇది.. విశాఖపట్నంలోని వాల్తేరు అప్‌­ల్యాం­డ్స్‌లో ఉన్న టీఎస్‌ (టౌన్‌ సర్వే) నం 1196, 1197, 1027, 1028లో ఉన్న భూముల్ని దసపల్లా భూము­లంటారు.

వీటిపై మా క్లయింట్‌ రాణి కమలాదేవి ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ భూములు రాణి కమలాదేవికి చెందినవేనని 2009­లో హైకోర్టు  తీర్పునిచ్చింది. ఇదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా వెలువరించింది. ప్రభుత్వ భూముల పరిధి నుంచి ఈ భూముల్ని తొలగించి, సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటించాలంటూ జిల్లా కలె­క్టర్‌కు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. ఈ విషయం కూడా పత్రికల్లో ప్రచురితమైంది. అయినప్పటికీ, ఉద్దేశ­పూర్వకంగానే ఈ నెల 11న ఈనాడు దినపత్రికలో ‘‘దసపల్లాపై అత్యుత్సాహం’’ పేరు­తో కథనాన్ని ప్రచురించారు.

ఈ కథనంలో ‘దసపల్లా భూముల విషయంలో న్యాయ పోరా­టానికి అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం, వ్యూహం ప్రకారం కలెక్టర్‌తో లేఖ రాయించి సీసీఎల్‌ఏతో ప్రైవేట్‌ వ్యక్తులకు అను­కూలంగా ఉత్తర్వులు ఇప్పించడం.. ఇవన్నీ గమ­నిస్తే దసపల్లా భూములపై తెరవెనుక ఎంత పెద్ద మంత్రాంగం జరిగిందో అర్థమవుతోంది’ అంటూ మా  క్లయింట్‌ పరువుకు భంగం కలిగించేలా అస­త్యపు ఆరోపణలతో కథనాన్ని ప్రచురించారు.

దసపల్లా భూముల వ్యవహారంలో రాణి కమలా­దేవి కుటుంబం ప్రతిష్టని దిగజార్చేలా అసత్యాల్ని ప్రచురిస్తున్నారు. ఈ కథనాన్ని ఖండిస్తూ ఈనాడు పత్రికలో సవరణ ప్రచురించాలి’ అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వెంటనే సవరణ వార్తని ప్రచురించకపోతే రూ.కోటికి పరువు నష్టం దావా వేస్తామని న్యాయవాది అరుణ్‌దేవ్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top