ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్‌ ఆఫీసర్లు

Nodal Officers For Medical Services Of Journalists In AP - Sakshi

సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన పాత్రికేయులకు సకాలంలో వైద్య సేవలందేలా నోడల్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సోకిన పాత్రికేయులకు, వైద్య ఆరోగ్య యంత్రాంగానికి మధ్య అనుసంధానకర్తలుగా పనిచేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్‌ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్‌ అధికారులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి నోడల్‌ అధికారిగా సమాచార, పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్‌ కుమార్‌ (మొబైల్‌ నం: 9121215223)ను నియమించామన్నారు.

అదేవిధంగా ప్రతి జిల్లాలో సంబంధిత అధికారుల ఫోన్‌ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచామన్నారు. నోడల్‌ అధికారులు సంబంధిత జిల్లాల్లో గుర్తించిన ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య సేవలు అందేలా చూస్తారన్నారు. పరీక్షల నిర్వహణ, కోవిడ్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకోవడం, వైద్య సేవలు వంటి విషయాల్లో వారు సహాయకారిగా ఉంటారన్నారు.

పాత్రికేయులకు వ్యాక్సిన్‌ వేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నోడల్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కోవిడ్‌ బారినపడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆసుపత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కోవిడ్‌ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షలు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని జిల్లాల్లోని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులకు అందజేయాల్సిందిగా కమిషనర్‌ తెలియజేశారు.
చదవండి:
ఎవరి కోసం చేశారు?.. దేవినేని ఉమాపై సీఐడీ ప్రశ్నల వర్షం  
ఏపీ: కోవిడ్‌ చికిత్సకు మరింత ఇద్దాం..

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top