
విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్‌ను డోర్ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం ఒకటి.
ఫలితంగా ఎండీయూ ఆనరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్ షాపుల నుండి సరఫరా చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.
మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే..
రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండీయూ ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండీయూ ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూ లో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గుచూపింది.
గత వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్‌ను ఇప్పటివరకూ డోర్ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే పొందుతుండగా మళ్లీ వెనకటి రోజుల గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. దాంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సంకేతాన్ని, సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది.