
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ నోటీసులు
ఆయా వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లదే బాధ్యతన్న డీఎంఈ
ప్రభుత్వం జరిమానా చెల్లించదని తేల్చి చెప్పిన వైనం
పీజీ, యూజీ అడ్మిషన్ల వేళ ఆందోళన.. గందరగోళం
ఏడాదిగా ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ఈ దుస్థితి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) కన్నెర్రచేసింది. లోపాలు దిద్దుకోకపోతే ఒక్కో మెడికల్ కాలేజీ రూ.కోటి జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. వారం కిందట జాతీయ మెడికల్ కమిషన్ అధికారి సుఖ్‌లాల్ మీనా రాష్ర్టంలోని అన్ని కాలేజీలకు విడివిడిగా నోటీసులు జారీ చేశారు. ఒక్కసారిగా రాష్ర్టంలోని 16 మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ నోటీసులు ఇవ్వడంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఉలిక్కి పడింది. గత ఏడాదిగా ఫ్యాకల్టీ లోపాలపై సర్కారు దృష్టి సారించలేదు. చాలా చోట్ల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఉంది. కొన్ని చోట్ల రెసిడెంట్‌లు, ట్యూటర్ల కొరతా వేధిస్తోంది. లోపాలు సరిదిద్దుకోమనడం వేరని, లేదంటే కోటి రూపాయల జరిమానా చెల్లించాలనడం ఏంటని డీఎంఈ కార్యాలయం మధనపడుతోంది.
మీరే బాధ్యులు.. మీరే చెల్లించాలి
ఈనెల 6వ తేదీన నోటిసులు వచి్చన అనంతరం డీఎంఈ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ల సమావేశం జరిగింది. వైద్య కాలేజీల్లో లోపాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లే బాధ్యులని, ఒక వేళ ఎన్‌ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తే రూ.కోటి జరిమానా ఆయా మెడికల్ కాలేజీలే చెల్లించాలని, ప్రభుత్వం ఈ డబ్బు ఇవ్వదని డీఎంఈ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి తామెందుకు బాధ్యత వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రంలో పెరగని విధంగా ఏపీలో యూజీ, పీజీ సీట్లు పెరిగాయి. భారీగా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నియామకం జరిగింది. మౌలిక వసతుల కల్పన ఊహించని స్థాయిలో జరిగింది. అయినా సరే సీట్లు నిలబడాలంటే ఎప్పటికప్పుడు వనరులు సమకూర్చుకోవాల్సిందే. కానీ కూటమి సర్కారు దీనిపై దృష్టి సారించలేదు.
ఇవీ ప్రధాన సమస్యలు
⇒ ఏడాదిగా పదోన్నతులు లేవు.. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత
⇒ హిస్టోపెథాలజీ, సైటో పెథాలజీ ఇన్వెస్టిగేషన్స్ వివరాలు లేకపోవడం
⇒ కొన్ని విభాగాల్లో మౌలిక వసతులు సరిగా కల్పించక పోవడం
⇒ ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వక పోవడం
⇒ పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు సరిపడా వసతులు లేవు
⇒ గైనిక్ వార్డుల్లో వేధిస్తోన్న బెడ్‌ల కొరత
⇒ అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు తదితర చోట్ల పరిస్థితులు దారుణం