కోవిడ్‌ కట్టడిలో ఏపీ ఆయుష్‌ కార్యక్రమాలు భేష్‌

NITI Aayog Praises On Covid-19 Prevention AP Ayush Programme - Sakshi

రాష్ట్రాల ఆయుష్‌ ఆధారిత అభ్యాసాల సంకలనంలో నీతి ఆయోగ్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఆయుష్‌ వైద్య సేవల ద్వారా కోవిడ్‌–19ను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించాయని నీతి ఆయోగ్‌ పేర్కొంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన వివిధ ఆయుష్‌ ఆధారిత కార్యక్రమాలు, పద్ధతుల సమాచారాన్ని వివరిస్తూ నీతి ఆయోగ్‌ ఓ సంకలనాన్ని రూపొందించింది. దీనిని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బేరీ, ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ముంజ్‌పరా మహేంద్రభాయ్‌ కాళూభాయ్‌ శనివారం విడుదల చేశారు. 

ఏపీలో గరిష్ట సామర్థ్యానికి తగ్గట్టుగా..
కోవిడ్‌–19 కట్టడి విషయంలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అందుబాటులో ఉన్న వనరుల గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కోవిడ్‌–19 రోగ నిరోధకత, కోవిడ్‌ అనంతర పునరుత్తేజం లక్ష్యాలతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ ఆయుష్‌ డిస్పెన్సరీలలో పనిచేస్తున్న సుమారు 339 మంది ఆయుష్‌ అధికారులకు కాంటాక్ట్‌ ట్రేసింగ్, మందుల పంపిణీ, నియంత్రణ, కౌన్సెలింగ్, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం విధులు కేటాయించారు.

దాదాపు 400 మంది పీజీ స్కాలర్లు, ఇంటర్న్‌లు ఆయుర్వేదం, హోమియోపతికి సంబంధించిన ప్రొఫిలాక్టిక్‌ ఔషధాల పర్యవేక్షణ, పంపిణీ చేశారు. కళాశాలల అధ్యాపకులు ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ నివారణ చర్యలను చేపట్టింది. ఆయుష్‌ కళాశాలల అధ్యాపకులు పీజీ స్కాలర్లు, ఇంటర్న్‌ల సహకారంతో అవగాహన శిబిరాలు నిర్వహించారు. 

తెలంగాణలోనూ చురుగ్గా..
తెలంగాణ ప్రభుత్వంలోని ఆయుష్‌ శాఖ.. కోవిడ్‌–19 కట్టడి కోసం కేసులను గుర్తించడం, వైరస్‌ వ్యాప్తిని తగ్గించే చర్యలు చేపట్టడం, వైరస్‌ నివారణ, నిర్వహణ ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది.  త్వరితగతిన నివారణ ఔషధాల తయారీ, పంపిణీని చేపట్టింది. ఆయుష్‌ బోధనా ఆసుపత్రులను ఐసోలేషన్‌ సెంటర్లుగా మార్చింది. మ్యూకోర్మైకోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌కు నివారణ, చికిత్సకు సంబంధించిన ఆయుష్‌ ప్రోటోకాల్‌లను వేగంగా అమలు చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా 461 ఆయుష్‌ అధికారులను కోవిడ్‌–19 నిఘా, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం ఉపయోగించారు. 1,126 మంది ఆయుష్‌ వైద్యులు హాస్పిటల్‌ ప్రోటోకాల్‌లకు సంబంధించిన వర్చువల్‌ ప్లాట్‌ఫామ్‌పై శిక్షణ పొందారు. 1,094 మంది ఆయుష్‌ సిబ్బందిని ఆయుష్‌ క్వారంటైన్‌/ఐసోలేషన్‌ సెంటర్‌లలో నియమించడంతో పాటు శిక్షణ కూడా అందించారు. 464 మంది వైద్యులు 602 సహాయక సిబ్బందితో కలిసి 4 ఆయుష్‌ బోధనా ఆసుపత్రులలో సేవలు అందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top